
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ కు సిద్ధమవుతున్నాడు. టీమిండియాలో చోటు కోల్పోయినా ఐపీఎల్ లో చాహల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మరో 10 రోజుల్లో జరగబోయే ఐపీఎల్ లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. మూడు సీజన్ లుగా రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ లెగ్ స్పిన్నర్.. రానున్న సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. ఇందులో భాగంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ లో బిజీగా మారిపోయాడు. అదేంటి చాహల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం ఆశ్చర్యంగా అనిపించినా అసలు విషయమేంటో ఇప్పుడు చూద్దాం.
పంజాబ్ కింగ్స్ తరపున తొలిసారి ఆడబోతున్న చాహల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ షాక్ ఇచ్చాడు. సోమవారం(మార్చి 10) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశాడు. ఈ వీడియోలో చాహల్ బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. ప్రత్యర్థి బౌలర్, వికెట్ కీపర్‌తో బ్యాటింగ్ గురించి చర్చిస్తున్నాడు. తన ఇంస్టాగ్రామ్ లో "పాంటింగ్ ఓపెనింగ్ స్లాట్ ఏమైనా ఖాళీగా ఉందా.. నేను సిద్ధంగా ఉన్నాను". అని సరదాగా రాసుకొచ్చాడు. చాహల్ బ్యాటింగ్ ప్రాక్టీస్, అతని పోస్ట్ కు నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి.
2025 ఐపీఎల్ సీజన్ లో బలంగా కనిపిస్తున్న పంజాబ్ కింగ్స్ కు సరైన ఓపెనర్లు లేరు. ఒక ఓపెనర్ గా ప్రబు సిమ్రాన్ సింగ్ ఉన్నా.. అతనితో పాటు మరో ఓపెనర్ లేకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో చాహల్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారుతుంది. ఐపీఎల్ లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డ్ చాహల్ పేరిట ఉంది. 160 మ్యాచ్ ల్లో 205 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. యల్ చరిత్రలో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో చాహల్ ను రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ లెగ్ స్పిన్నర్ పై పంజాబ్ కింగ్స్ భారీ అసలు పెట్టుకుంది.