పిల్లనిచ్చిన మామే యముడు.. IRS అల్లుడుని కాల్చి చంపిన IPS మామ

పిల్లనిచ్చిన మామే యముడు.. IRS అల్లుడుని కాల్చి చంపిన IPS మామ

ఛండీగర్: పంజాబ్లోని ఛండీగర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. పంజాబ్ మాజీ ఏఐజీ తన సొంత అల్లుడినే జిల్లా కోర్టు ఆవరణలో కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. ఆ అల్లుడు కూడా ఐఆర్ఎస్ అధికారి కావడం గమనార్హం. ఆ మాజీ ఏఐజీని మల్వీందర్ సింగ్ సాధుగా పోలీసులు గుర్తించారు. ఇరు వర్గాలకు ముందు నుంచే గొడవలున్నాయి. ఈ గొడవల కారణంగానే జిల్లా కోర్టుకు మామ, అల్లుడు తమ వర్గాలతో వెళ్లారు. కోర్టు ఆవరణలో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. బాత్రూమ్కు వెళ్లొస్తానని నిందితుడు చెప్పాడు. మామ బాత్రూంకు వెళ్తానని చెప్పగానే అల్లుడు దారి చూపించాడు. 

బాత్రూం వైపు నుంచి ఇద్దరూ తిరిగొస్తుండగా మాజీ ఏఐజీ మల్వీందర్ సింగ్ గన్ తీసి అల్లుడిని టార్గెట్ చేసి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. రెండు బుల్లెట్లు ఐఆర్ఎస్ అధికారి శరీరంలోకి చొచ్చుకెళ్లగా, ఒక బులెట్ బాత్రూం డోర్లోకి వెళ్లింది. రెండు బులెట్లు మిస్ అయ్యాయి. ఆ తుపాకీ కాల్పుల మోతతో కోర్టు దద్దరిల్లిపోయింది. కోర్టులో ఉన్నవాళ్లంతా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

 

నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. చనిపోయిన ఐఆర్ఎస్ అధికారిని హర్పీత్ సింగ్గా పోలీసులు గుర్తించారు. జిల్లా కోర్టులోనే ఈ హత్య జరగడంతో భయానక వాతావరణం నెలకొంది. ఈ హత్య ఘటనకు సంబంధించిన దృశ్యాలు కోర్టులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మామ కాల్పులు జరిపిన సందర్భంలో కాపాడమని అల్లుడు కేకలు వేయడం ఆ విజువల్స్ లో స్పష్టంగా కనిపించింది. ఇంతలో ఆ దగ్గరలో ఉన్న ఒకతను.. ‘‘కాల్చేశాడు.. త్వరగా హాస్పిటల్ కు తీసుకెళ్లండి’’ అని అరుస్తూ అక్కడి నుంచి భయంతో పరుగులు తీయడం కనిపించింది. 

ఘటన జరిగిన తర్వాత కోర్టు దగ్గరే ఉన్న కొందరు లాయర్లు ధైర్యం చేసి నిందితుడిని పట్టుకున్నారు.  పోలీసులు వచ్చేంత వరకూ ఒక రూంలో బంధించారు. స్పాట్ రక్తపు మడుగుతో కనిపించింది. బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు.