ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కేటాయించిన అదనపు భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవాలని పంజాబ్ పోలీసులు నిర్ణయించారు. రాష్ట్రం వెలుపల కేజ్రీవాల్‌కు రక్షణ కల్పించడంలో పంజాబ్ భద్రతా దళాల ప్రమేయంపై ఢిల్లీ పోలీసులు ఆందోళనలు వ్యక్తం చేసిన తర్వాత పంజాబ్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, అరవింద్ కేజ్రీవాల్‌లకు బెదిరింపుల గురించి ఎప్పటికప్పుడు తమకు నివేదికలు వస్తున్నాయన్న పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్.. వాటిని సంబంధిత ఏజెన్సీలతో పంచుకుంటామని తెలిపారు. గురువారం(జనవరి 23) ఢిల్లీ పోలీసులు, ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి.. కేజ్రీవాల్‌కు కల్పించిన అదనపు భద్రతను ఉపసంహరించుకున్నామని వెల్లడించారు.
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు
70 మంది సభ్యులు గల ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ బెదిరింపుల వల్లే పంజాబ్ పోలీసులు.. కేజ్రీవాల్‌కు కల్పించిన అదనపు భద్రత ఉపసంహరించుకున్నారని ఆప్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.