GT vs PBKS: శ్రేయస్ అయ్యర్ వీరోచిత ఇన్సింగ్.. గుజరాత్ ముందు భారీ టార్గెట్

GT vs PBKS: శ్రేయస్ అయ్యర్ వీరోచిత ఇన్సింగ్.. గుజరాత్ ముందు భారీ టార్గెట్

ఐపీఎల్ 2025లో భాగంగా గుజరా‎త్ తో జరిగిన తొలి మ్యాచులో పంజాబ్ బ్యాటర్స్ దుమ్మురేపారు. గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (97) వీరోచిత ఇన్సింగ్ ఆడగా.. చివర్లో శశాంక్ సింగ్ (44) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ నిర్ణీత నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్‎లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‎లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 

దీంతో మొదట బ్యాటింగ్‎కు దిగిన పంజాబ్‎కు ఆదిలోనే షాక్ ఇచ్చాడు రబాడ. ఒపెనర్ ప్రభుమాన్ సింగ్ (5 )ను ఫస్ట్ ఓవర్లోనే ఔట్ చేశాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య , కెప్టెన్ అయ్యర్ ఇన్సింగ్‎ను చక్కదిద్దారు. ఇద్దరు ఆచీతూచీ ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. హాఫ్ సెంచరీకి చేరువలో ప్రియాన్ష్ ఆర్య (47) రషీద్ ఖాన్ బౌలింగ్‎లో ఔట్ అయ్యాడు. తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ 16, మార్కస్ స్టోయినిస్ 20 పరుగులు చేశారు. ఆసీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్ వెల్ డకౌట్ అయ్యి నిరాశపర్చాడు. 

ఓ వైపు వికెట్లు పడుతోన్న మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడాడు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత గేర్ మార్చిన అయ్యర్ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్ల వర్షం కురిపించాడు. చివర్లో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ కూడా అయ్యర్ మాదిరిగానే గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 16 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సులు బాది 44 పరుగులు చేశాడు. అయ్యర్, శశాంక్ మెరుపు బ్యాటింగ్‎తో 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ బౌలర్లో సాయి కిశోర్ 3 వికెట్లు పడగొట్టగా, రషీద్ ఖాన్, రబాడ చెరో వికెట్ తీశారు.