
- కేకేఆర్‌పై అద్భుత విజయం
- అదరగొట్టిన చహల్, యాన్సెన్
- 95 రన్స్‌కే కుప్పకూలిన కోల్‌కతా
ముల్లన్‌పూర్: ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తూ.. భారీ స్కోర్లతో రికార్డులు బద్దలవుతున్న ఐపీఎల్–18లో లో స్కోరింగ్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. సన్ రైజర్స్‌తో గత మ్యాచ్‌లో 245 రన్స్ చేసినప్పటికీ ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ ఈసారి 111 రన్స్ మాత్రమే చేసినా అద్భుతమైన బౌలింగ్‌తో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెక్ పెట్టి ఔరా అనిపించింది. యుజ్వేంద్ర చహల్ (4/28) స్పిన్ మ్యాజిక్ తోడు మార్కో యాన్సెన్ (3/17) పేస్ పవర్‌తో దెబ్బకొట్టడంతో మెగా లీగ్‌లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసుకున్న టీమ్‌గా రికార్డు సృష్టించింది.
బౌలింగ్‌లో అదరగొట్టినా.. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో హిట్టర్లంతా తేలిపోవడంతో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 16 రన్స్ తేడాతో పంజాబ్ చేతిలో చిత్తయింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 రన్స్‌కు ఆలౌటైంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (15 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 30), ప్రియాన్ష్ ఆర్య (12 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణా ( 3/25) మూడు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లు సునీల్ నరైన్ (2/14), వరుణ్ చక్రవర్తి (2/21) చెరో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో కేకేఆర్ 15.1 ఓవర్లలో 95 రన్స్‌కే కుప్పకూలింది. అంగ్‌క్రిష్ రఘువంశీ (28 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 37) ఒంటరి పోరాటం చేశాడు. చహల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఓపెనర్లు మెరిసినా..
గత మ్యాచ్‌లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్‌పై భారీ స్కోరు చేసిన పంజాబ్ ఈ సారి సొంతగడ్డపై వంద దాటేందుకే ఇక్కట్లు పడింది. కింగ్స్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ తొలి వికెట్‌కు 39 రన్స్ జోడించి జట్టుకు మంచి ఆరంభమే ఇచ్చినా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. అన్రిచ్ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లతో ఆర్య జోరు చూపెట్టగా.. వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సిక్స్, రెండు ఫోర్లతో 20 రన్స్ రాబట్టాడు.
ఆపై నాలుగో ఓవర్లో హర్షిత్ రాణాకు ఆర్య సిక్స్‌తో వెల్‌కం చెప్పాడు. కానీ, తర్వాతి బాల్‌కే లెంగ్త్ డెలివరీతో ఓపెనర్ వికెట్ తీసిన రాణా.. నాలుగో బాల్‌కు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (0)ను డకౌట్ చేశారు. ఆర్య, శ్రేయస్ ఇద్దరూ రమణ్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చారు. రెండు బాల్స్ తేడాలో రెండు వికెట్లు పడ్డ తర్వాత పంజాబ్ కోలుకోలేకపోయింది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేసిన తర్వాతి ఓవర్లో స్లాగ్ స్వీప్‌కు ట్రై చేసిన జోష్ ఇంగ్లిస్ (2) లైన్ మిస్సయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆరో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన ప్రభ్ సిమ్రన్‌ను కూడా హర్షిత్ వెనక్కుపంపడంతో పంజాబ్ పవర్ ప్లేలోనే 54/4తో పీకల్లోతు కష్టాల్లో పడ్డది.
ఫీల్డింగ్ మారిన తర్వాత కూడా ఆతిథ్య జట్టు వికెట్ల పతనం ఆగలేదు. అన్రిచ్ బౌలింగ్‌లో నేహల్ వాధెర (10) వెంకటేశ్‌కు క్యాచ్ ఇవ్వగా.. హిట్టర్ మ్యాక్స్‌వెల్ (7) మళ్లీ ఫెయిలయ్యాడు. వరుణ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. నరైన వేసిన 11వ ఓవర్లో సుయాంశ్ షెగ్డే (4) కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా.. మార్కో యాన్సెన్ (1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో 86/8తో నిలిచిన పంజాబ్ వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. చివర్లో శశాంక్ సింగ్ (18), బార్ట్‌లెట్ (11) కాసేపు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. వరుణ్ బౌలింగ్‌లో సిక్స్‌తో శశాంక్ స్కోరు వంద దాటించాడు. 16వ ఓవర్లో వైభవ్ మూడు బాల్స్ తేడాలో ఈ ఇద్దరినీ ఔట్ చేయడంతో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది.
చహల్, మార్కో కమాల్... కేకేఆర్ ఢమాల్
ఛేజింగ్‌లో కేకేఆర్ కూడా ఆరంభం నుంచే తడబడింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వరుస వికెట్లతో ఆ టీమ్‌ను అద్భుతంగా నిలువరించారు. ఇన్నింగ్స్ ఆరో బాల్‌కే డేంజర్ ఓపెనర్ సునీల్ నరైన్ (5) బౌల్డ్ చేసిన యాన్సెన్ తొలి దెబ్బకొట్టగా.. రెండో ఓవర్లో మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (2)ను బార్ట్‌లెట్ ఔట్ చేశాడు. ఈ దశలో యంగ్‌స్టర్ అంగ్‌క్రిష్ రఘువంశీ, కెప్టెన్ అజింక్యా రహానె (17)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. బార్ట్‌లెట్ వేసిన ఆరో ఓవర్లో రహానె సిక్స్ కొట్టగా.. రఘువంశీ 6, 4 బాదడంతో పవర్ ప్లేలో 55/2తో నిలిచిన కేకేఆర్ ఈజీగా నెగ్గేలా కనిపించింది.
కానీ, ఎనిమిదో ఓవర్లో స్పిన్నర్ చహల్ రంగప్రవేశంతో సీన్ రివర్సైంది. తన వరుస ఓవర్లలో రహానెతో పాటు రఘును ఔట్ చేసిన చహల్ పంజాబ్‌ను రేసులోకి తెచ్చాడు. బ్యాటింగ్‌లో నిరాశపరిచిన మ్యాక్స్‌వెల్ స్పిన్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. హిట్టర్ వెంకటేశ్ అయ్యర్ (7)ను ఊరించే బాల్‌తో ఎల్బీ చేయడంతో 11 ఓవర్లకు కేకేఆర్ 74/5తో నిలిచింది. రింకూ సింగ్ (2), రమణ్ దీప్ (0) క్రీజులో ఉండటంతో ఆ టీమ్ ఆశలు కోల్పోలేదు. కానీ, 12వ ఓవర్లో వరుస బాల్స్‌తో ఈ ఇద్దరినీ పెవిలియన్ చేర్చిన చహల్ స్టేడియాన్ని హోరెత్తించాడు.
ఆ వెంటనే హర్షిత్ రాణా (3)ను యాన్సెన్ బౌల్డ్ చేయడంతో 79/8తో కేకేఆర్ ఓటమి ముంగిట నిలిచింది. కేకేఆర్‌కు 33 రన్స్ అవసరం అవగా ఆండ్రీ రస్సెల్ (17).. చహల్ చివరి ఓవర్లో భారీ షాట్లతో 6, 6, 4 కొట్టి కేకేఆర్‌ను తిరిగి రేసులోకి తెచ్చాడు. కానీ, తర్వాతి ఓవర్‌ను మెయిడిన్ చేసిన అర్ష్‌దీప్.. వైభవ్ అరోరా (1)ను తొమ్మిదో వికెట్‌గా ఔట్ చేయడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకుంది. తర్వాతి ఓవర్ తొలి బాల్‌కే రస్సెల్‌ను యాన్సెన్ బౌల్డ్ చేయడంతో పంజాబ్ చారిత్రక విజయం ఖాతాలో వేసుకుంది.
సంక్షిప్త స్కోర్లు
పంజాబ్ కింగ్స్: 15.3 ఓవర్లలో 111 ఆలౌట్ (ప్రభ్‌సిమ్రన్ సింగ్ 30, ప్రియాన్ష్ ఆర్య 22, హర్షిత్ 3/25, నరైన్ 2/14).
కోల్‌కతా: 15.1 ఓవర్లలో 95 ఆలౌట్ (రఘువంశీ 37, రస్సెల్ 17, చహల్ 4/28, యాన్సెన్ 3/17).
అప్పుడు 262 కొట్టి.. ఇప్పుడు 111 కాపాడుకొని
ఐపీఎల్‌లో అత్యధిక టార్గెట్ ఛేజ్ చేసిన పంజాబ్ కింగ్స్ అత్యల్ప స్కోరును కాపాడుకున్న టీమ్‌గా అరుదైన ఘనత సాధించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి కోల్‌కతానే కావడం విశేషం. గతేడాది ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఇచ్చిన 262 టార్గెట్ ఛేజ్ చేసిన పంజాబ్.. ఇప్పుడు తమ సొంతగడ్డపై చిన్న స్కోరు కాపాడుకుంది.
111 ఐపీఎల్‌లో ఒక టీమ్ కాపాడుకున్న లోయెస్ట్ స్కోరు ఇదే. 2009లో పంజాబ్‌పై చెన్నై 116/9 స్కోరును డిఫెండ్ చేసుకుంది.
8 లీల్‌లో చహల్ 4 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన సందర్భాలు. సునీల్ నరైన్ రికార్డును సమం చేశాడు.
206 ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి వచ్చిన రన్స్. లీగ్‌లో ఒక మ్యాచ్‌లో మూడో అత్యల్పం. 2017లో కేకేఆర్,ఆర్సీబీ మ్యాచ్‌లో 180 రన్స్ నమోదవగా.. 2018లో ముంబై, సన్ రైజర్స్ కలిపి 205 రన్స్ చేశాయి.