
ఛండీఘర్: హోలీ పండుగ వేళ పంజాబ్‌లో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు శివసేన మోగా జిల్లా అధ్యక్షుడు మంగత్ రాయ్‌ను కాల్చి చంపారు. పోలీసుల వివరాల ప్రకారం.. గురవారం (మార్చి 13) రాత్రి మంగత్ రాయ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో మోగా స్టేడియం రోడ్డులో కొందరు దుండగులు అతడిని ఫాలో అయ్యి కాల్పులు జరిపారు. భయాందోళనకు గురైన మంగత్ రాయ్ దుండగుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.
కానీ మోటార్ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతడిని వెంబడిస్తూ కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పల్లో మంగత్ రాయ్‌తో పాటు ఓ 11 ఏళ్ల బాలుడు కూడా గాయపడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగత్ రాయ్ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏకంగా శివసేన జిల్లా అధ్యక్షుడిని దారుణంగా హత్య చేయడం పంజాబ్‌లో సంచలనం రేపుతోంది.
ALSO READ | Success: ఆంధ్రదేశంలో బౌద్దమతాన్ని విస్తరించిన ఆచార్య నాగార్జునుడు
మంగాత్ రాయ్ హత్యపై శివసేన పంజాబ్ అధ్యక్షుడు హరీష్ సింగ్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోగాకు చేరుకుని మంగత్ రాయ్ పార్థివదేహానికి నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర యంత్రాంగం పూర్తి విఫలమైందని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగత్ రాయ్ హత్య వెనక ఉగ్రవాద కోణం ఉందా అని దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు.