బిగ్ బాష్ లీగ్‪లో రాణిస్తున్న యువరాజ్ శిష్యుడు.. ఎవరీ నిఖిల్ చౌదరి?

బిగ్ బాష్ లీగ్‪లో రాణిస్తున్న యువరాజ్ శిష్యుడు.. ఎవరీ నిఖిల్ చౌదరి?

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (BBL)లో భారత మాజీ అండర్-19 క్రికెటర్, మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ శిష్యుడు నిఖిల్ చౌదరి అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ టోర్నీలో హోబర్ట్ హరికేన్స్‌ తరుపున ఆడుతున్న ఈ భారత ఆల్ రౌండర్.. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ మంచి ప్రదర్శన కనపరుస్తున్నాడు.  

పంజాబ్‌కు చెందిన 27 ఏళ్ల నిఖిల్ చౌదరి తన అద్భుతమైన ప్రదర్శనలతో బిగ్ బాష్ లీగ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఇటీవల సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి వికెట్‌ పడగొట్టిన చౌదరి.. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్ సిగ్నేచర్ స్టైల్‌ను రీ-క్రియేట్ చేశాడు. అనంతరం మెల్‌బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లోనే 32 పరుగులు చేసి ఔరా అనిపించాడు.

అవకాశం ఎలా వచ్చిందంటే..?

కుటుంబసభ్యులతో కలిసి సెలవులకని ఆస్ట్రేలియా వెళ్లిన నిఖిల్ చౌదరికి ఆ ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది. అతడు స్థానికంగా ఆస్ట్రేలియా పోస్ట్‌లో కొరియర్‌గా పని చేస్తూ, నార్తర్న్ సబర్బ్స్ క్లబ్‌కు ఆడటం మొదలుపెట్టాడు. ఆ సమయంలో అతని ప్రతిభను గుర్తించిన మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ జేమ్స్ హోప్స్.. అతన్ని హోబర్ట్ హరికేన్స్‌కు సిఫార్సు చేశారు. అలా నిఖిల్ చౌదరి బిగ్ బాష్ లీగ్ కాంట్రాక్ట్‌ పొందాడు.

ఎవరీ నిఖిల్ చౌదరి..?

నిఖిల్ చౌదరి లెగ్ స్పిన్నర్ మరియు రైట్ హ్యాండ్ బ్యాటర్. ఇతను 1996 మే 4న జన్మించాడు. చిన్న వయస్సులోనే ఢిల్లీ నుండి పంజాబ్‌కు మకాం మార్చాడు. అక్కడ మాజీ భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కెప్టెన్సీలో రాష్ట్ర జట్టులో భాగమయ్యాడు.  అదే సమయంలో భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌ నుండి ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలి.. పెద్ద లక్ష్యాలను ఎలా అధిగమించాలి వంటి పలు మెళుకువలు నేర్చుకున్నాడు. ఆఫ్ స్పిన్నర్ అవ్వడానికి ముందు ఇతగాడు ఆసీస్ దిగ్గజం బ్రెట్ లీ మాదిరి పేస్ బౌలర్ అవ్వాలనుకున్నాడట. కానీ, ఎన్నో ఒడిదుడుకుల అనంతరం స్పిన్నర్‌గానే స్థిరపడటానికి మొగ్గు చూపాడట.  

ఇప్పటివరకూ రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన నిఖిల్ చౌదరి ఒక వికెట్ పడగొట్టాడు. అలాగే, 16 టీ20 మ్యాచ్‌ల్లో 26.88 సగటుతో 40 వికెట్లు తీశాడు.