డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన లేడీ కానిస్టేబుల్.. కళ్లు బైర్లు కమ్మే రీతిలో ఆస్తులు

డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన లేడీ కానిస్టేబుల్.. కళ్లు బైర్లు కమ్మే రీతిలో ఆస్తులు

సమాజంలో ప్రస్తుతం డ్రగ్స్ ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది. డ్రగ్స్‎కు బానిస యువత ఎంతో అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దీంతో డ్రగ్స్‎కు వ్యతిరేకంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ స్మగ్లర్లపై కొరడా ఝలిపిస్తు్న్నారు. ఓ వైపు పోలీసులు డ్రగ్స్ కట్టడిపై ఉక్కుపాదం మోపుతుంటే.. ఓ లేడీ కానిస్టేబుల్ మాత్రం ఇవేవి నాకు సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరించింది. ఎంచక్కా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. పక్కా ప్లాన్ ప్రకారం లేడీ కానిస్టేబుల్‎ను రెడ్ హ్యాండెడ్‏గా అరెస్ట్ చేశారు. డిపార్ట్ మెంట్ పరువు తీయడంతో ఉద్యోగం నుంచి పీకి పడేశారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

పోలీసుల వివరాల ప్రకారం.. భటిండాలో పోలీస్ కానిస్టేబుల్‎గా పని చేస్తోన్న అమన్‎దీప్ కౌర్ గత కొంతకాలంగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం (ఏప్రిల్ 4) కూడా నిషేధిత హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తోన్నట్లు సమాచారం అందింది. దీంతో భటిండా పోలీసులు, యాంటీ-నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ బృందం భటిండాలోని బాదల్ ఫ్లైఓవర్ సమీపంలో కౌర్ కారును ఆపి తనిఖీలు నిర్వహించారు. కారు గేర్‌బాక్స్ దగ్గర ఉన్న ఓ పెట్టేలో 17.71 గ్రాముల హెరాయిన్‌ను గుర్తించామని తెలిపారు. వెంటనే కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని, ఆమె కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కౌర్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్లు అధికారులు ప్రకటించారు. అలాగే.. కౌర్ ఆస్తులు, ఇతర ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

ఈ ఘటనపై  ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుఖ్‌చెయిన్ సింగ్ గిల్ స్పందిస్తూ.. మాదకద్రవ్యాల సంబంధిత నేరాలకు పాల్పడినట్లు తేలిన ఏ సిబ్బందినైనా తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కౌర్‌ను పదవి నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. ‘‘మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్న ఏ ఉద్యోగిని కూడా వదిలిపెట్టవద్దని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కౌర్‎పై తక్షణ చర్య తీసుకోవాలని మాన్సా ఎస్ఎస్పీకి ఆదేశాలు జారీ చేశాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్‌ను విధుల నుంచి తొలగించాం’’ అని ఐజి గిల్ అన్నారు. కౌర్‎కు ఒక ఆడి, రెండు ఇన్నోవా కార్లు, ఒక బుల్లెట్ బైక్, రూ. 2 కోట్ల విలువైన ఇల్లు వంటి బహుళ విలాసవంతమైన ఆస్తులను ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.