
బెంగుళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఎట్టకేలకు మొదలైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకే టాస్ పడాల్సి ఉండగా.. వర్షం వల్ల డిలే అయింది. భారీ వర్షం కురవడంతో స్టేడియాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఎట్టకేలకు వర్షం తగ్గుముఖం పట్టడంతో రాత్రి 9.30 గంటలకు టాస్ వేశారు. మ్యాచ్ ను 14 ఓవర్లకు కుదించారు. పవర్ ప్లే 4 ఓవర్లుగా నిర్ణయించారు మ్యాచ్ రిఫరీలు.
ఇక, ఈ మ్యాచులో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సొంత గడ్డపై ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఆర్సీబీ జట్టులో ఎలాంటి మార్పు లేకుండానే బరిలోకి దిగగా.. పంజాబ్ మాత్రం జట్టులో రెండు మార్పులు చేసింది. మాక్స్వెల్ స్థానంలో స్టోయినిస్ జట్టులోకి రాగా.. హర్‌ప్రీత్ బ్రార్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడతాడని అయ్యర్ తెలిపాడు.
సొంత గడ్డలో ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన ఆర్సీబీ ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో బరిలోకి దిగుతుండగా.. లాస్ట్ మ్యాచులో 111 పరుగుల సల్ప లక్ష్యాన్ని కాపాడుకుని అద్భుత విజయం సాధించిన పంజాబ్ రెట్టించిన ఉత్సాహంతో ఆర్సీబీతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ సీజన్లో చెరో 6 మ్యాచులు ఆడిన ఆర్సీబీ, పంజాబ్.. నాలుగింట్లో విజయం సాధించి.. రెండు మ్యాచుల్లో ఓటమి పాలయ్యాయి. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉండగా.. పంజాబ్ ఫోర్త్ ప్లేస్‌లో ఉంది.
జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, యశ్ దయాల్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, నేహాల్ వధేరా, శ్రేయాస్ అయ్యర్ (సి), శశాంక్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (w), మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్