పరిచయం : పేపర్​బాయ్​ టు పంజాబీ స్టార్!​

పరిచయం : పేపర్​బాయ్​ టు పంజాబీ స్టార్!​

గిప్పీ గ్రేవల్.. ఈ పేరు మనకు పెద్దగా పరిచయం లేదు కానీ, పంజాబీ ఇండస్ట్రీలో మోస్ట్​ పాపులర్​. యాక్టర్​, డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్, సింగర్​గా స్టార్​డమ్​ తెచ్చుకున్న మల్టీ టాలెంటెడ్​ పర్సన్. కానీ, ఈ స్థాయికి రావడానికి పడిన కష్టాలు చాలానే ఉన్నాయి. దాదాపు పదిహేనేండ్ల కెరీర్​లో తాను ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నాడు. తన సక్సెస్​లో భార్య సహకారం ఉందని కొనియాడే కంప్లీట్ ఫ్యామిలీమ్యాన్​. అలాంటి గిప్పీ మరోసారి డైరెక్టర్​గా ‘అకాల్​ : అన్​కాంకర్డ్​’ అనే హిస్టారికల్ ఫిల్మ్​ తీశాడు. అలాగే యాక్టర్​గా తను నటించిన ‘చమక్​ : ది కంక్లూజన్​’ అనే మ్యూజిక్ మిస్టరీ థ్రిల్లర్​ సిరీస్​తో థ్రిల్ చేశాడు. మరి ఇంత ఇంట్రెస్టింగ్​గా ఉన్న గిప్పీ జర్నీ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

గిప్పీ గ్రేవల్​ అసలు పేరు రూపీందర్ సింగ్​. అతని సొంతూరు లూథియానాలోని కూమ్​ కలన్ గ్రామం. చాలామంది యువకుల్లానే చిన్న గ్రామం నుంచి వచ్చి యాక్టర్​ అవ్వడానికి నానాకష్టాలు పడ్డాడు. సినిమాల్లోకి రాకముందు నార్త్​ ఇండియా ఇనిస్టిట్యూట్​లో హోటల్ మేనేజ్​మెంట్ చదివాడు. తర్వాత కెనడా వెళ్లి అక్కడ ఒక రెస్టారెంట్​లో వెయిటర్​గా పనిచేశాడు. కొన్నిసార్లు కార్లు కూడా కడిగాడు. 2002లో తిరిగి ఇండియాకు వచ్చాడు. అప్పుడే తన మనసుకు నచ్చిన మ్యూజిక్​ని కెరీర్​గా ఎంచుకున్నాడు. అదే ఏట ‘చఖ్​ లయి’ అనే ఆల్బమ్​ లాంచ్​ చేశాడు. అలా మొదట పాటలతో మొదలైన గిప్పీ కెరీర్​ చాలా ఏండ్ల వరకు సాగింది.. కానీ, సక్సెస్ అనేది తాను చూడలేదు. మొదట్లో పంజాబీ మ్యూజిక్ వీడియోలు చేస్తూనే పెండ్లిళ్లలో పాటలు కూడా పాడేవాడు.

టర్నింగ్ పాయింట్

2010లో ‘ఫుల్కరి’ ఆల్బమ్​ తన కెరీర్​ని మలుపుతిప్పింది. ఒక్కసారిగా ఫేమస్​ అయిపోయాడు. ఆడియెన్స్​ తన పాటలకోసం ఎదురుచూసేవాళ్లు. అలా కొంతకాలం పాటు ఆల్బమ్​ సాంగ్స్ చేస్తూ తన కెరీర్ కొనసాగించాడు. సాంగ్ అల్బమ్స్​తోపాటు యాక్టింగ్ కూడా చేసేవాడు. అలా పంజాబీ మ్యూజిక్​ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్​గా స్టార్​డమ్ సంపాదించుకున్నాడు. 2012లో తన ఆల్బమ్​ ‘అంగ్రేజీ బీట్’ అనే పాట కాక్​టెయిల్ అనే బాలీవుడ్​ సినిమాలో వాడారు. ఆ పాట తన ఆల్బమ్స్​లోనే ఐకానిక్​గా నిలిచిపోయింది. గిప్పీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. మ్యూజిక్ ఇండస్ట్రీలో పాపులర్ కావడంతో సినిమాల్లో నటించాలనుకున్నాడు. 

2010లో ‘మెల్ కరాదే రబ్బా’ అనే సినిమాతో నటనలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత నటన, పాటలు, డైరెక్షన్, ప్రొడక్షన్​ విభాగాల్లో పనిచేశాడు. ఈ నెలలో రిలీజ్ అయిన ‘అకాల్​: ది అన్​కాంకర్డ్’ సినిమా తన డైరెక్షన్​లో వచ్చినదే. 2023 నాటికి బాలీవుడ్, పంజాబీ ఇండస్ట్రీల్లో సక్సెస్​ఫుల్​గా నిలిచాడు. తను నటుడిగా, ప్రొడ్యూసర్​గా తెరకెక్కిన ‘క్యారీ ఆన్ జట్టా 3’ సినిమా పంజాబీ ఇండస్ట్రీలోనే మొదటిసారి బాక్సాఫీస్ వద్ద100 కోట్లు రాబట్టింది. అలాగే వార్నింగ్ –2, శిందా శిందా నో పాపా, జట్​ ను చురైల్ టక్రి వంటి సినిమాలు స్టార్​గా నిలబెట్టాయి. 

ప్రొడ్యూసర్​గా..

2016లో హంబుల్ మోషన్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్​ హౌస్ స్టార్ట్ చేశాడు. 2022లో బిగ్​ డాడీ ఫిల్మ్స్​ ప్రొడక్షన్ హౌస్ పేరుతో రెండోది లాంచ్ చేశాడు. ప్రస్తుతం తన బ్రదర్ సిప్పీ గ్రేవల్​తో కలిసి​ ఆ రెండు​ ప్రొడక్షన్ హౌస్​లు నడిపిస్తున్నాడు. తన సొంత బ్యానర్​లో డైరెక్టర్​, రైటర్, యాక్టర్​గా మారి ‘అర్దాస్’ అనే సినిమా చేశాడు. ఆ తర్వాత 2019లో ‘అర్దాస్ కరాన్’ పేరుతో సీక్వెల్​ కూడా చేశాడు. ఆ సినిమాకు కూడా ఆయా విభాగాల్లో బాధ్యత తీసుకున్నాడు. అలాగే కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్, యాక్టర్​గా పనిచేశాడు. పంజాబీ, హిందీ ఇండస్ట్రీల్లో సింగర్, యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్​గా మంచి పేరు తెచ్చుకున్నాడు. పంజాబీ ఇండస్ట్రీలో పలు ప్రతిష్టాత్మక అవార్డులు సాధించాడు.

పాన్ ఇండియా సినిమా

భాషాంతరాలు లేకుండా అందరికీ సినిమా రీల్ అవ్వాలనే ఉద్దేశంతో పాన్​ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైంది. ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీలో బాహుబలి, పుష్ప, కేజీఎఫ్​, కాంతార లాగానే పాన్​ ఇండియా సినిమాలు తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందులో పంజాబీ ఇండస్ట్రీ కూడా ఒకటి. పంజాబీ ఇండస్ట్రీకి పలు విభాగాల్లో ఎన్నో సేవలు అందిస్తోన్న గిప్పీ కూడా ఆ ఉద్దేశంతోనే ‘అకాల్’ అనే హిస్టారికల్ మూవీ తీశాడు. 

దీన్ని హిందీ, పంజాబీ భాషల్లో విడుదల చేశాడు. ‘కథ పరంగా కొన్ని కాంట్రవర్సీలు ఎదుర్కొన్నప్పటికీ బాలీవుడ్​, పంజాబీ సినిమాలకు మధ్య భాషాంతరాలు లేకుండా చేసినందుకు చాలామంది అభినందిస్తున్నారు. ఇలా రెండు భాషల్లో రిలీజ్ చేయడం వల్ల ఎక్కువమంది ఆడియెన్స్​కు రీచ్​ అవుతుంది. తద్వారా పాన్​ ఇండియా ఐడెంటిటీ పొందుతుందని నమ్ముతున్నట్టు ‘అకాల్’​ సినిమాకు సంబంధించి మాట్లాడాడు. 

క్రెడిట్ అంతా ఆమెదే..

పర్సనల్​ లైఫ్​ గురించి అడిగితే.. ‘నాకు, రవ్​నీత్​తో 20 ఏండ్ల వయసులోనే పెండ్లి అయింది. అప్పటికీ ఏ జాబ్​ లేదు, ఫైనాన్షియల్​గా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజులవి. ఆ స్ట్రగుల్స్​లో ఉన్నప్పుడునన్ను నమ్మి, సపోర్ట్​ చేసింది నా భార్యే. బతుకుదెరువు కోసం కెనడా వెళ్లాం. అక్కడ మేమిద్దరం మూడేసి ఉద్యోగాలు చేసేవాళ్లం. పొద్దున్నే పేపర్​ బాయ్​గా నా వర్క్​ మొదలవుతుంది. తర్వాత నా భార్య,నేను దాదాపు 9 గంటలపాటు ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్లం.

రాత్రుళ్లు నా భార్యతో కలిసి ఫుడ్​కోర్ట్​లో క్లీనింగ్​, మాపింగ్, ప్లేట్లు కడగడం వంటివి చేసేవాడిని. నా భార్య చేసే మూడో పని ఏంటంటే.. సబ్​వేలో శాండ్​విచ్​లు తయారుచేయడం. అలాగే నేను పేపర్లు వేసేటప్పుడు తను డ్రైవింగ్​ చేసేది. కెనడాలో ఉన్నన్ని రోజులు ఇద్దరం ఇలానే కష్టపడ్డాం. ఇన్ని పనులు చేయడంలో నేను ఎంజాయ్ చేసేవాడిని. నా భార్య నిరంతరం నన్ను ఎంకరేజ్​ చేసేది. అందువల్లే అడ్డంకుల్ని ఎదుర్కొని, నా కలలను నెరవేర్చుకోవడానికి ముందుకెళ్లగలిగా. నా సక్సెస్​కు కారణం నా భార్య రవ్​నీత్ కౌర్” అని చాలా సందర్భాల్లో చెప్పాడు గిప్పీ. ప్రస్తుతం ఆమె కూడా ప్రొడ్యూసర్​గా సినిమాలు తీస్తోంది. వీళ్లకు ముగ్గురు పిల్లలు గుర్​ఫతే, ఎకొమ్​కర్, గుర్బాజ్​.