అమెరికాలో పంజాబ్ టెర్రరిస్ట్ హర్ ప్రీత్ అరెస్ట్

అమెరికాలో పంజాబ్ టెర్రరిస్ట్ హర్ ప్రీత్ అరెస్ట్

న్యూయార్క్/చండీగఢ్: పంజాబ్ టెర్రరిస్టు, మాజీ గ్యాంగ్ స్టర్ హర్ ప్రీత్ సింగ్ అలియాస్  హ్యాపీ పాసియాను అమెరికాలో ఎఫ్‎బీఐ పోలీసులు అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలోని సాక్రమెంటో సిటీలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎఫ్​బీఐ అధికారులు శుక్రవారం ‘ఎక్స్’ లో వెల్లడించారు. పంజాబ్‎లో పలు టెర్రర్ దాడుల్లో హర్ ప్రీత్ కీలక సూత్రధారుడు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఐఎస్ఐ, ఖలిస్తానీ గ్రూప్ బీకేఐతోనూ అతనికి సంబంధాలు ఉన్నాయి. 

అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన అతడిని ఎఫ్బీఐ, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్‎మెంట్ అధికారులు అరెస్టు చేశారు. మరోవైపు అతని అరెస్టుపై పంజాబ్ పోలీసులు హర్షం వ్యక్తంచేశారు. టెర్రరిజంపై పోరాడుతున్న దేశాలకు హర్ ప్రీత్ అరెస్టు గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు. అతడి అరెస్టును కేంద్రం దృష్టికి తీసుకుపోయామని, అతడిని ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించామని పంజాబ్ పోలీస్ చీఫ్ గౌరవ్ యాదవ్ తెలిపారు. 2023 నుంచి 2025 మధ్య పంజాబ్‎తో పాటు పలు రాష్ట్రాల్లో టెర్రర్ కార్యకలాపాలకు పాల్పడ్డాడని తెలిపారు.