
ముల్లన్‌పూర్: ఐపీఎల్‌తో మరో టాలెంటెడ్ ప్లేయర్ వెలుగులోకి వచ్చాడు. పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న 24 ఏండ్ల ఢిల్లీ క్రికెటర్ ప్రియాన్ష్ ఆర్య (42 బాల్స్‌లో 7 ఫోర్లు, 9 ఫోర్లతో 103) మెగా లీగ్‌లో తన నాలుగో మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు. పేరున్న స్టార్లంతా నిరాశపరచడంతో తన జట్టు 83/5తో నిలిచిన దశలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లపై పిడుగల్లే రెచ్చిపోయాడు.
ఖతర్నాక్ షాట్లతో సిక్సర్ల వర్షం కురిపిస్తూ 39 బాల్స్‌లోనే సెంచరీ అందుకున్నాడు. అతని జోరుతో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 18 రన్స్ తేడాతో సీఎస్కేను ఓడించి మూడో విజయం అందుకుంది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 219/6 స్కోరు చేసింది. ఆర్యకు తోడు శశాంక్ సింగ్ (36 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 నాటౌట్), మార్కో యాన్సెన్ (19 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 నాటౌట్) దంచికొట్టారు.
సీఎస్కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో సీఎస్కే 20 ఓవర్లలో 201/5 చేసి ఓడింది. డెవాన్ కాన్వే (49 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69), శివం దూబే (27 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42)తో పాటు చివర్లో ఎంఎస్ ధోనీ (12 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 27) మెరిసినా చెన్నైకి నాలుగో ఓటమి తప్పలేదు. ఫెర్గూసన్ రెండు వికెట్లు తీశాడు. ఆర్యకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఆర్య అదుర్స్
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే రెండు సిక్సర్లు కొట్టిన ఓపెనర్ ఆర్య ఓ ఎండ్‌లో అదరగొడుతున్న.. మరోవైపు మిగతా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రెండో ఓవర్లోనే ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (0)ను బౌల్డ్ చేసిన ముకేశ్ చౌదరి చెన్నైకి బ్రేక్ ఇచ్చాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (9)ను ఖలీల్ బౌల్డ్ చేశాడు. స్టోయినిస్ (4) కూడా అతనికే వికెట్ ఇచ్చుకున్నాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్న ఏమాత్రం వెనక్కు తగ్గని ఆర్య భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అశ్విన్ వేసిన ఆరో ఓవర్లో ఫోర్, రెండు సిక్సర్లు కొట్టి 19 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకొని పవర్ ప్లేలో జట్టును 75/3తో నిలిపాడు. అశ్విన్ బౌలింగ్‌లో నేహల్ వాధెర (9), మ్యాక్స్‌వెల్ (1) ఔటైనా.. నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్లో శశాంక్ సింగ్ సిక్స్, ఆర్య ఫోర్‌తో ఇన్నింగ్స్‌కు మళ్లీ ఊపు తెచ్చారు.
ఆపై ఆశ్విన్ బౌలింగ్‌లో ఆర్య రెండు సిక్సర్లు కొడితే.. శశాంక్ ఓ బాల్‌ను స్టాండ్స్‌కు చేర్చడంతో స్టేడియం హోరెత్తింది. పతిరణ వేసిన 13వ ఓవర్లో వరుసగా 6, 6, 6, 4తో రెచ్చిపోయిన ఆర్య సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో పంజాబ్ స్కోరు 151/5కి పెరిగింది. నూర్ బౌలింగ్‌లో శంకర్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆర్య అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న శశాంక్‌తో పాటు యాన్సెన్ స్లాగ్ ఓవర్లలో దంచడంతో పంజాబ్ భారీ స్కోరు చేసింది.
చెన్నై పోరాడినా..
భారీ టార్గెట్ ఛేజింగ్‌ను సీఎస్కే మెరుగ్గా ఆరంభించింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (36), డెవాన్ కాన్వే వరుస బౌండ్రీలు కొట్టడంతో పవర్ ప్లేలో 59/0 స్కోరు చేసింది. ఫీల్డింగ్ మారిన తర్వాత పార్ట్‌టైమ్ స్పిన్నర్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో రచిన్ స్టంపౌట్ అవ్వడంతో పంజాబ్‌కు ఫస్ట్ బ్రేక్ లభించింది. ఆ వెంటనే ఫెర్గూసన్ బౌలింగ్‌లో కెప్టెన్ గైక్వాడ్ (1) ఔటవడంతో చెన్నై డీలా పడ్డట్టు కనిపించింది.
కానీ, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన శివం దూబే భారీ షాట్లతో ఎటాక్ చేశాడు. వరుస క్యాచ్ ఔట్ల నుంచి తప్పించుకున్న కాన్వే కూడా జోరు పెంచాడు. యాన్సెన్ వేసిన 14వ ఓవర్లో కాన్వే 4, 6.. దూబే సిక్స్ కొట్టడంతో చెన్నై తిరిగి రేసులోకి వచ్చింది. చివరి ఆరు ఓవర్లలో ఆ టీమ్‌కు 81 రన్స్ అవసరమైన టైమ్‌లో పంజాబ్ బౌలర్లు మూడు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వలేదు.
దూబే ఔటవ్వడంతో సీఎస్కేపై ఒత్తిడి పెరిగింది. ఈ టైమ్‌లో ఫెర్గూసన్ బౌలింగ్‌లో ధోనీ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి ఆశలు రేపాడు. అదే ఓవర్లో కాన్వే రిటైర్డ్ ఔట్ అవ్వగా.. క్రీజులోకి వచ్చిన జడేజా(9 నాటౌట్) ప్రభావం చూపలేదు. చివరి రెండు ఓవర్లలో సీఎస్కేకు 42 రన్స్ అవసరం అవగా.. అర్ష్‌దీప్ బౌలింగ్ 4,6 కొట్టిన ధోనీ చివరి ఓవర్లో ఔటవ్వడంతో చెన్నైకి పరాజయం తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
పంజాబ్: 20 ఓవర్లలో 219/6 (ఆర్య 103, శశాంక్ 52*, ఖలీల్ 2/45).
చెన్నై: 20 ఓవర్లలో 201/5 (కాన్వే 69 , దూబే 42, ఫెర్గూసన్ 2/40).