
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్లు.. బట్ట తలకు మళ్లీ జుట్టు వస్తుందని హెయిర్ ఆయిల్ రాస్తే కంటి చూపు కోల్పోయి ఏకంగా 65 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన పంజాబ్ లో జరిగింది.
అసలేం జరిగిందంటే? పంజాబ్ లోని సంగ్రూర్ లో మిరాకిల్ హెయిర్ గ్రోత్ ఉచిత క్యాంప్ నిర్వహించారు కొందరు నిర్వాహకులు. తాము ఇచ్చిన ఆయిల్ రాస్తే కొన్ని రోజుల్లోనే మీకు జుట్టు వస్తుందని..జుట్టు రాలకుండా ఉంటుందని తెగ ప్రచారం చేశారు. దీనికి అట్రాక్ట్ అయిన 65 మంది మిరాకిల్ హెల్త్ క్యాంప్ కు వెళ్లారు. వాళ్లు ఇచ్చిన ఆయిల్ ను తలకు పూసుకున్నారు. స్నానం చేసిన తర్వాత వెం టనే వారి కళ్లల్లో తీవ్రంగా మంట రావడం స్టార్ట్ అయ్యింది. దీంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు..
హెయిర్ఆయిల్ ను తలకు పూసుకుని10 నిమిషాల తర్వాత కడుక్కోమని వాళ్లు చెప్పారు. మేం ఆయిల్ ను తలకు పూసుకున్న తర్వాత కళ్లల్లో మంట వచ్చింది అని ఆస్పత్రిలో జాయిన్ అయిన ఓ బాధితురాలు మీడియాకు తెలిపింది.
బాధితులు జుట్టు కోసం వాడిన ఆయిల్ ను తలకు రాసుకున్నారు. దానిని శుభ్రం చేసుకున్న తర్వాత వారి కళ్లలో నొప్పితో పాటు ఎరుపు రంగు ఇన్ఫెక్షన్ వచ్చిందని సివిల్ సర్జన్ సంజయ్ కమేరా చెప్పారు. నిర్వాహకులు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఫ్రీ క్యాంప్ ఏర్పాటు చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చాం..ఆరోగ్య అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సంజయ్ కమేరా తెలిపారు.
ఈ ఘటనపై సంగ్రూర్‌లోని అజిత్ నగర్‌కు చెందిన బాధితుడు సుఖ్‌వీర్ సింగ్ ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సంజీవ్ సింగ్లా తెలిపారు. బీఎన్ఎస్ లోని సెక్షన్ 124 చట్టం కింద నిందితులు తేజిందర్ పాల్ సింగ్,లూధియానా బార్బర్ అమన్ దీప్ సింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.