
హైదరాబాద్: యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వారిపై తెలంగాణ పోలీసులు నిఘా పెట్టారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినందుకు నటి విష్ణు ప్రియపై పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణు ప్రియకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు(మంగళవారం) సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు తమ ముందు హాజరు కావాలని పంజాగుట్ట పోలీసులు విష్ణుప్రియకు నోటీసులో స్పష్టం చేశారు. విష్ణు ప్రియను అరెస్ట్ చేసే అవకాశాలూ లేకపోలేదు. మరి కొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కేసులో ఉన్న నిందితుల ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడంతో వారు ఎక్కడున్నారని ఆరా తీసే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు.
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన 11 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రెటీలపై పంజాగుట్ట పోలీసులు సోమవారం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో యాంకర్లు విష్ణుప్రియ, శ్యామలతో పాటు హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, రీతూ చౌదరి, బండారు శేషాయని సుప్రిత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్ ఉన్నారు. వీరిపై పలు సెక్షన్లు, యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఇప్పటికే సేకరించిన యాప్ లింక్స్ ఆధారంగా వీరికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
Also Read:-వ్యభిచార రొంపిలో దింపేందుకు బాలిక కిడ్నాప్..
హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన వినయ్ తన ఫ్రెండ్స్‌తో కలిసి అమీర్‌పేట్‌లో కోచింగ్ తీసుకుంటున్నాడు. స్నేహితులతో కలిసి సోషల్‌మీడియాలో బెట్టింగ్ యాప్స్ గుర్తించాడు. ఈ ఇల్లీగల్ యాప్స్‌ను సోషల్ మీడియాలో సెలబ్రెటీలు ప్రమోట్ చేస్తున్నారని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తను కూడా ఇలాంటి యాప్స్‌కు ప్రభావితమైనట్టు అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ల బండారం బయటపెడుతూ యువతకు చైతన్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.