సర్వేలన్నీ మోడీవైపే : పురందేశ్వరి

విశాఖపట్నం : లోక్ సభ అభ్యర్థుల నామినేషన్లతో విశాఖపట్నంలో రాజకీయ సందడి పెరిగింది. నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఒక్క సారిగా ప్రముఖ పార్టీలకు చెందిన సభ్యులు నామినేషన్ వేశారు.
బీజేపీ తరపున పురందేశ్వరి విశాఖ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తనకు విశాఖ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చిన బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు. తాను వేసే ప్రతి అడుగులోను తన తండ్రి ఎన్టీఆర్ దీవెనలు ఎప్పుడు ఉంటాయన్నారు.

తాను విశాఖకు ప్రాతినిధ్యం వహించిన ఐదు సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని తెలిపారు పురందేశ్వరి. ప్రజలు తాను చేసిన అభివృద్ధిని బేరీజు వేసుకుని మద్దతు ఇవ్వాలని కోరారు.

ఎన్నికలకు ముందు ఏ సర్వే చూసినా బీజేపీకి అనుకూలంగానే వస్తోందన్నారు పురందేశ్వరి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్ళీ అధికారంలోకి వస్తారని చెబుతున్నాయన్నారు. విశాఖ నగరాభివృద్ధే తమ ప్రధాన ఎజెండా అని చెప్పారు.