వనపర్తి, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పత్తి రైతులకు ఈ సారి కష్టాలు తప్పడం లేదు. పత్తి తీసే దగ్గర్నించి, కొనుగోలు దాకా అవస్థలే ఉన్నాయి. స్థానికంగా కొనుగోలు కేంద్రాలు లేక పంటను అమ్మేందుకు కర్ణాటకకు తీసుకెళ్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలో పత్తి దిగుబడి సగానికి పడిపోయింది. ఇప్పుడు పత్తి తీయడానికి ఇతర ప్రాంతాల నుంచి కూలీలు వస్తున్నారు. ఆ కూలీల రేట్లు కూడా పెరిగాయని రైతులు వాపోతున్నారు.
పత్తి కొనుగోలు కేంద్రాలేవి?
ఉమ్మడి జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేసినా పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో స్థానిక పత్తిని కర్ణాటక లోని రాయచూరులో అమ్మేందుకు తరలిస్తున్నారు. అయితే గతంలో జడ్చర్ల లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. నాగర్ కర్నూల్ జిల్లా లోని కాటన్ మిల్లులలో నేరుగా పత్తి కొనుగోలు చేసే వారు. ఇక్కడ మార్కెట్ ధర కంటే తక్కువ ధర వస్తుండటంతో రైతులు ఆసక్తి చూపటం లేదు.
రాయచూరు లో తగ్గిన పత్తి ధరలు
ఉమ్మడి జిల్లా నుంచి రైతులు రాయచూరుకు ఎక్కువ సంఖ్యలో వెళ్లడంతో వ్యాపారులు ధరలను అమాంతం తగ్గించేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం రూ.12 వేలు పలికిన పత్తి క్వింటాలు ధర ప్రస్తుతం రూ. 6 నుంచి 7 వేల వరకే ఉందని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకంటే మార్కెట్లో ఎంతో కొంత ఎక్కువ రేటు పలుకుతోంది. దీంతో రైతులు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నట్టు అధికారులు చెప్తున్నారు.
డిమాండ్ ను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం:
గిట్టుబాటు ధర కంటే బయట మార్కెట్లో రైతులకు పత్తికి ఎక్కువ ధర లభిస్తుండటంతో సీసీఎస్ సెంటర్ల కు రైతులు రావటం లేదు. వెల్టూరు సమీపంలో పత్తి మిల్లులో కొనుగోలు చేపట్టినా రైతులు ఇక్కడ ధర లేదని బయటి కి వెళుతున్నారు. సన్నా, చిన్న కారు రైతులు మాత్రం ఇక్కడే పత్తిని అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం.డిమాండ్ ను బట్టి అవసరం అయిన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తం.
- వేణుగోపాల్,
వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్