వడ్ల కొనుగోలుకు రెడీ .. కోతలు జరిగే ప్రాంతాల్లో ముందుగా సెంటర్లు

వడ్ల కొనుగోలుకు రెడీ .. కోతలు జరిగే  ప్రాంతాల్లో ముందుగా సెంటర్లు
  • గన్నీలు.. ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు

యాదాద్రి, సూర్యాపేట, వెలుగు: యాసంగి సీజన్‌‌లో వడ్ల  కొనుగోలుకు సెంటర్లను గుర్తించారు.  గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు సహా అవసరమైన వాటిని సమకూర్చుకుంటున్నారు. ముందుగా కోతలు ప్రారంభించిన మండలాల పరిధిలో కొనుగోలు సెంటర్లను ప్రారంభించనున్నారు. ఈ సెంటర్లకే రెడీగా ఉన్న గన్నీలు, టార్పాలిన్లు పంపిస్తున్నారు. అవసరమైన వాటికి ఇండెంట్లు ఇప్పటికే హయ్యర్​ ఆఫీసర్లకు పంపించారు. 

యాదాద్రి జిల్లాలో..

ఈ యాసంగి సీజన్​లో  2.80 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఈ సీజన్​లో దొడ్డు రకం పండిస్తున్నారు. 6.50 లక్షల నుంచి 7 లక్షల టన్నుల వరకూ దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. ఆ అంచనా మేరకు జిల్లాలో 372 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే 2 లక్షల టన్నుల నుంచి 3 లక్షల టన్నుల వరకూ మిల్లర్లు కొనుగోలు చేసే అవకాశం ఉందని భావించిన ఆఫీసర్లు, కొనుగోలు సెంటర్లకు 4 లక్షల నుంచి 4.50 లక్షల టన్నుల వరకూ వస్తుందని అంచనా వేశారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న సెంటర్లకు అనుగణంగా గన్నీలు, టార్పాలిన్లు, తేమ యంత్రాలతో పాటు ప్యాడీ క్లీనర్లు సమకూరుస్తున్నారు. 

ఇప్పటికే 285 ప్యాడీ క్లీనర్లు ఉండగా కొత్తగా మరో ఐదు ఆటోమెటిక్​ ప్యాడీ క్లీనర్లను తెప్పించారు. దిగుబడి, సెంటర్లకు వచ్చే వడ్ల అంచనాల ప్రకారం దాదాపు కోటి గన్నీ బ్యాగులు అవసరం పడుతున్నాయి. ఇప్పటికే 55 లక్షల గన్నీ బ్యాగులు రెడీగా ఉన్నాయి. మిగిలిన వాటికి ఇండెంట్​ పెట్టారు. కాగా జిల్లాలోని మోత్కూరు, రామన్నపేట, అడ్డగూడూరు మండలాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. దీంతో ముందుగా ఆయా మండలాల్లో సెంటర్లు ప్రారంభించాలని ఆఫీసర్లు భావించారు. అందుకే ఆ మండలాల పరిధిలోని 48 సెంటర్లకు ఇప్పటికే 3 లక్షల గన్నీ బ్యాగులను తరలించారు. ఈ నెల 2,3 తేదీల్లో కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. 

సూర్యాపేట జిల్లాలో..

సూర్యాపేట జిల్లాలో 4,73, 739 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో సన్న రకం 2,63,250 ఎకరాల్లో సాగు చేయగా 6,58,125 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. దొడ్డు రకం 2,10,489 ఎకరాలకు గాను 5,47,271 టన్నుల దిగుబడి వస్తుండగా రెండు రకాలు కలిపి మొత్తం 12 లక్షల టన్నుల దిగుబడి రానుంది. ఇందులో స్థానిక అవసరాలకు 98,718 టన్నులు, విత్తనాల కొరకు 1600 టన్నులు అవసరమవుతాయని ఆంచనా వేస్తున్నారు. 

ప్రైవేట్ వ్యాపారస్తులకు మరో 6,97,142 మెట్రిక్ టన్నులు విక్రయించనున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసే 311 సెంటర్ల కు 4.07 లక్షల టన్నుల వడ్లు వస్తాయని అంచనా వేశారు. ధాన్యం సేకరణకు 75 లక్షల గన్నీ బ్యాగులు అవసరం అవుతాయని లెక్కలు వేశారుఇప్పటికే 25 లక్షల గన్నీ బ్యాగులు సిద్దంగా ఉండగా కొనుగోలు సెంటర్ల ప్రారంభం అయ్యే నాటికి మరో 10 లక్షల గన్నీ బ్యాగులను సమీకరించనున్నారు. 

నల్గొండ జిల్లాలో

నల్లగొండ జిల్లాలో ఈ సీజన్‌‌లో 11.26 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 12.14లక్షల  టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. మిల్లర్లు 5.68 లక్షల టన్నులు కొంటారని, కొనుగోలు సెంటర్లకు 5.57 లక్షల టన్నులు వస్తాయని ఆఫీసర్లు భావిస్తున్నారు.  జిల్లాలో దాదాపు 20 శాతం వరి కోతలు పూర్తి కాగా కొంత కొనుగోలు సెంటర్లకు వచ్చింది. అయితే ఇటీవల రెండు కొనుగోలు సెంటర్లను మంత్రి కోమటిరెడ్డి  ప్రారంభించారు. 1.39 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కాగా 30 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ఈ సారి 375 సెంటర్లు ఏర్పాటు 
చేయనుండగా అందులో 71 సన్న వడ్ల కొనుగోలు చేయనున్నారు. 

అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం: వడ్ల కొనుగోళ్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశాం. రైతులకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. గన్నీ బ్యాగులను ఇప్పటికే తెప్పించాం. అవసరమైన మరిన్నింటిని కూడా తెప్పిస్తున్నాం. 

హరికృష్ణ, సివిల్​ సప్లయ్​ డీఎం, యాదాద్రి