వడ్లను అగ్గువకే అమ్ముకుంటున్నరు ..పోలీస్ కాళ్లు మొక్కిన రైతులు

ఐకేపీ సెంటర్లలో కొనుగోళ్ల ఆలస్యం..

రైతులకు శాపం తేమ, తాలు పేరుతో కిలోలకు కిలోలు కటింగ్​ 

దిక్కుతోచక ప్రైవేటు వ్యాపారుల వైపు చూపు ఇదే అదునుగా క్వింటాల్​కు రూ. 400 దాకా దోచుకుంటున్న వ్యాపారులు

కరీంనగర్/ సూర్యాపేట, వెలుగు:  ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో కొనుగోళ్లు ఆలస్యమవుతుండడం, మిల్లుల్లో అన్ లోడింగ్ ఆగిపోవడంతో దిక్కుతోచని రైతులు వడ్లను బయట అగ్గువకే అమ్ముకుంటున్నారు. తేమ పేరుతో సెంటర్లలో కొనుగోళ్లకు నిరాకరిస్తున్న మిల్లర్లు.. తప్పనిసరై దింపుకుంటే క్వింటాల్​కు 5 నుంచి 10 కిలోల దాకా తరుగుతీస్తున్నారు. వానలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఆందోళనలో ఉన్న రైతులు వీలైనంత త్వరగా వడ్లను అమ్ముకునేందుకు  మొగ్గుచూపుతున్నారు. ఇదే అదునుగా మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులు సెంటర్ల నుంచి వచ్చిన వడ్లను మిల్లుల్లో దింపుకోకుండా.. రైతుల నుంచి నేరుగా కొంటున్నారు. వడ్ల మద్దతు ధర క్వింటాల్క రూ. 2,040 ఉండగా..  రూ.1,600 నుంచి 1,800 రేటుతో రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నారు. 

దీంతో మద్దతు ధరతో పోలిస్తే క్వింటాపై రూ.200 నుంచి 400 వరకు అన్నదాతలు నష్టపోతున్నారు. రోజుల తరబడి ఎదురుచూపులు
ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్ల కోసం రోజుల తరబడి రైతులు ఎదురుచూడాల్సి వస్తున్నది. యాసంగి కొనుగోళ్ల లక్ష్యం 80.46 లక్షల టన్నులు కాగా, సోమవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 6,087 కేంద్రాల ద్వారా 15.38 లక్షల టన్నుల వడ్లను మాత్రమే సేకరించారు.  కొనుగోళ్లు మొదలై నెల రోజులు గడుస్తున్నా  19 శాతం వడ్లు మాత్రమే కొనుగోలు చేయడం, చెడగొట్టు వానలతో వడ్లు కొట్టుకుపోతుండడంతో రైతుల్లో ఓపిక నశిస్తున్నది. దీంతో తక్కువ ధరకే  ప్రైవేట్​ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.

మంత్రి ఆదేశించినా..!

వరుసగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ సెంటర్లు, కల్లాల్లో పోసిన వడ్లు పుట్ల కొద్దీ కొట్టుకుపోగా, చాలాచోట్ల మొలకలొచ్చాయి. బాయిల్డ్ రైస్ మిల్లులకు వచ్చే వడ్లలో 20 శాతం వరకు తేమ ఉన్నా తీసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల బాయిల్డ్ రైస్ మిల్లర్స్ ను ఆదేశించారు. కానీ, తమకు నష్టం వస్తుందనే కారణంతో తడిసిన వడ్లను కొనేందుకు మిల్లర్లు మొండికేస్తున్నారు. 17 శాతం తేమ దాటితే చాలు ఇష్టారాజ్యంగా కోత పెడుతున్నారు. 60 క్వింటాళ్ల లోడులో కొందరు 5 క్వింటాళ్లు మైనస్ చేస్తుంటే.. మరికొందరు ఆరేడు క్వింటాళ్ల వరకు కటింగ్ పెడుతున్నారు. దీంతో ఒక్కో లోడ్ పై రైతులు రూ. 10 వేల నుంచి 15 వేల వరకు నష్టపోతున్నారు. ఈ దోపిడీని సహించలేక ఎవరైనా రైతులు వెనక్కి వస్తే ట్రాక్టర్ కిరాయిలు రూ. 3 వేలు, హమాలీ ఖర్చులు మరో రూ. 2 వేలు మీద పడే పరిస్థితి ఉంటున్నది. దీంతో చాలా మంది రైతులు మిల్లర్లు చెప్పినట్లు కటింగ్ కు ఒప్పుకుంటున్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోనూ ఒక్కో చోట ఒక్కో విధంగా తరుగు తీస్తున్నారు. 40 కిలోల బస్తాను కాంటా వేసినప్పుడు 42  కిలోలు, 42.50‌‌‌‌‌‌‌‌ కిలోలు, మరికొన్ని చోట్ల 43 కేజీలు ఉండేలా చూస్తున్నారు. తీరా రైస్ మిల్లుకు తీసుకెళ్లాక మొత్తం ఎన్ని క్వింటాళ్ల వడ్లు ఉన్నాయో చూసి.. క్వింటాకు 8 నుంచి 11 కిలోలు తరుగు తీస్తున్నారు. ఇలా ఒక్కో లోడ్ లో 60 క్వింటాళ్ల వడ్లు ఉంటే 5 నుంచి 7 క్వింటాళ్ల వడ్లను తాలు, తేమ పేరిట మైనస్ చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 

లారీల కోసం రోడ్డుమీదికి

సూర్యాపేట చుట్టుపక్కల  వడ్ల  కొనుగోలు సెంటర్లలో కాంటా అయిన వడ్లు  మిల్లులకు తరలించేందుకు లారీలు దొరకడంలేదు.  సూర్యాపేట, జనగాం క్రాస్‌‌‌‌రోడ్డు వద్ద   ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ 65పై  తిరిగే లారీలను  మళ్లించేందుకు రెవెన్యూ,  ట్రాన్స్ పోర్టు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. దీంతో రైతులే  రోడ్డెక్కి హైవేపై ఖాళీగా వెళ్తున్న  లారీల వెంటపడి, తమ వడ్లను తరలించాలని యజమానులను, డ్రైవర్లను వేడుకుంటున్నారు.  సెంటర్లలో కాంటాలైన వడ్లు లారీల కొరతతో ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. ట్రాన్స్​పోర్ట్  కాంట్రాక్టర్లు  అవసరమైనన్ని లారీలను  ఏర్పాటు చేయకపోవడం,  కొన్ని లారీలు ఏర్పాటు చేసినా మిల్లర్లు వెంటవెంటనే  అన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకోకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. 

వడ్లు కొనాలంటూ రాస్తారోకో

ఐకేపీ  కేంద్రాల్లో కొనుగోళ్లు  నిలిచిపోవడంతో  వెంటనే  వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యాపేట,  జనగాం హైవే పై రైతులు  రాస్తారోకో చేశారు.  సూర్యాపేట జిల్లాలోని బాలెంల ఐకేపీ సెంటర్​లో  పది రోజుల నుంచి వడ్లు కొంటలేరని  మండిపడ్డారు. చెడగొట్టు వానల వల్ల వడ్లు తడిసి మొలకలు వస్తున్నాయని,  ఆర్డీవో, ఎంఆర్వో చూసి వెళ్తున్నారేగానీ  కొనుగోలు జరిపేలా చర్యలు తీసుకోవడంలేదని వారు అన్నారు. రాస్తారోకో వల్ల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.  రైతులకు పోలీసులు నచ్చచెప్పే ఆందోళన విరమింపజేశారు.

బయట అమ్ముకున్న

ఐకేపీ సెంటర్లలో అవినీతి ఎక్కువైంది. క్వింటాకు 6 కేజీల నుంచి 8 కేజీల చొప్పున కటింగ్ చేస్తున్నరు. దీనికి తోడు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. అధికారులను ప్రశ్నిస్తే తేమ శాతం ఎక్కువగా ఉందని కొనుగోలు చేయబోమని అంటున్నరు. నేరుగా తడిసిన వడ్లను పారా బాయిల్డ్ మిల్లుకు తీసుకెళ్తే మిల్లు ఓనర్ క్వింటాకు రూ.1,700 రేటు పెట్టి కొన్నరు. ఐకేపీ సెంటర్, రైస్ మిల్లుల్లో కలిపితే క్వింటా మీద 10 కిలోల వరకు తీసేస్తున్నరు. ఇట్ల చూసినా క్వింటా మీద రూ.200 లాస్.  ఐకేపీలో ఏ విధంగానైతే నష్టపోతున్నామో అలాంటి నష్టమే ప్రైవేట్ వ్యాపారులకు అమ్మినా జరుగుతున్నది. 
- పైండ్ల మోహన్ రెడ్డి, రైతు, పెద్దంపల్లి, కరీంనగర్​ జిల్లా 

లారీల కోసం 3 రోజుల సంది తిరుగుతున్నాం 

పది రోజుల కింద  ఐ‌‌‌‌కే‌‌‌‌పీ సెంటర్ కు వడ్లు తెచ్చిన.  లారీలు లేక  కాంటాలు  ఆలస్యం చేస్తున్నరు. మూడు రోజుల నుంచి  రోజూ వచ్చి లారీల కోసం ఎదురుచూస్తున్న.   డ్రైవర్లను బతిమిలాడుతున్నా ఎవరు వస్తలేరు. 
-  విమలమ్మ, కందగట్ల, ఆత్మకూర్(ఎస్) మండలం, సూర్యాపేట