![జమ్మికుంటలో దగా దగా : వ్యాపారుల సిండికేట్.. పత్తి రైతుల విల విల](https://static.v6velugu.com/uploads/2025/02/purchase-of-cotton-has-stopped-for-three-days-in-all-agricultural-markets-across-karimnagar-district_FyC7SKsghv.jpg)
జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యవసాయ మార్కెట్లలో మూడు రోజులుగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సీసీఐ సర్వర్ డౌన్ కావడం వల్లే కొనుగోళ్లకు అంతరాయం ఏర్పడిందని సీసీఐ అధికారులు చెబుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు సిండికేట్‌గా మారి వేలంలో పాల్గొనకుండా వెనుదిరుగుతున్నారు. దీంతో మార్కెట్‌కు పత్తి తీసుకొచ్చిన రైతులు వ్యాపారి చెప్పిన రేటుకు అమ్మి నష్టపోతున్నారు. గురువారం 105 క్వింటాళ్ల పత్తి రాగా కొనుగోళ్లు లేక అలాగే ఉండిపోయింది. మరోవైపు సీసీఐ సర్వర్ ప్రాబ్లమ్ క్లియర్ అయ్యేదాకా మార్కెట్లకు పత్తి తీసుకురావొద్దని సీసీఐ అధికారులు చెబుతున్నారు.
సిండికేట్‌గా మారి వేలంలో పాల్గొనకుండా..
సీసీఐ సర్వర్ డౌన్ కావడంతో మూడు రోజులుగా పత్తి కొనుగోళ్లకు బ్రేక్ పడింది. గురువారం తెల్లవారుజామున జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 10 వాహనాల్లో సుమారు 105 క్వింటాళ్ల పత్తిని తీసుకొచ్చారు. సీసీఐ సర్వర్ డౌన్ కావడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయన్న విషయం తెలిసి రైతులు ఆందోళన చెందారు. ఇదే అదనుగా ఉదయం 10గంటలకు వేలం పాటకు రావాల్సిన వ్యాపారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. సిండికేట్‌గా మారి వేలంలో పాల్గొనకుండా వెనుదిరిగారు. దీంతో రైతులు మళ్లీ తమ పంటను వెనక్కి తీసుకెళ్లలేక వ్యాపారుల చెప్పినట్లుగా రూ.6వేల నుంచి రూ.7వేల వరకు అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ మద్దతు ధర రూ.7,421 కాగా క్వింటాకు రూ.500 నుంచి 1400 వరకు నష్టపోయామని రైతులు వాపోయారు. కొనుగోళ్లు నిలిచిన ఈ మూడు రోజుల్లో సుమారు 1000 క్వింటాళ్ల పత్తి తీసుకురాగా.. దీనిలో చాలావరకు తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. కాగా జమ్మికుంట మార్కెట్‌లో సిండికేట్ దందాపై మార్కెట్ చైర్‌పర్సన్ స్వప్న గురువారం అడ్తీ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. మద్దతు ధరకు కొనాలని ఆమె సూచించగా.. తమకు గిట్టుబాటు కావడం లేదంటూ వారు వెనుదిరిగారు.
ఎన్ని రోజులైనా సీసీఐ పత్తి కొంటుంది..
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో మూడు రోజులుగా సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోయాయి. సర్వర్ పనిచేసేదాకా రైతులు మార్కెట్‌కు పత్తి తీసుకురాకపోవడం మంచిది. ఎన్ని రోజులైనా పత్తి కొంటాం. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జమ్మికుంట మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిచిన విషయమై వ్యాపారులతో మాట్లాడాం. మద్దతు ధరకు కొనాలని వారిని ఆదేశించాం. ఒకవేళ ఎవరైనా రైతులను మోసం చేసినా, తక్కువ ధరకు కొన్నట్లు తెలిసినా చర్యలు తీసుకుంటాం. ఈ ఏడాది జమ్మికుంటతోపాటు జిల్లాలోని చొప్పదండి, గోపాల్‌రావుపేట, కరీంనగర్ మార్కెట్లలో సీసీఐ ద్వారా దాదాపు 4.77లక్షల క్వింటాళ్ల పత్తి కొనగా.. ఒక్క జమ్మికుంటలోనే 8 మిల్లుల ద్వారా 2.44లక్షల క్వింటాళ్లు కొన్నాం.
Also Read :- శంకర్ నాయక్ 34 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా
ఈ రైతు పేరు గొర్రు సారయ్య. మహాముత్తారం మండం అడవిశ్రీరాంపురం. తన పొలంలో పండిన పత్తిని గురువారం తెల్లవారుజామున జమ్మికుంట మార్కెట్‌కు తీసుకొచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చాక సీసీఐ సర్వర్ సమస్య ఉండడంతో పత్తి కొంటలేరని తెలిసింది. కనీసం ప్రైవేటు వ్యాపారులకైనా అమ్ముదామని 10 గంటల వరకు ఎదురుచూసినప్పటికీ వ్యాపారులు రాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తాను దాదాపు 80 కిలోమీటర్ల దూరం నుంచి పత్తిని తీసుకొచ్చానని, అమ్ముకుందామంటే వ్యాపారులు కొంటలేరని వాపోయాడు. చివరికి చేసేదేమీ లేక తక్కువ ధరకు అమ్ముకున్నట్లు చెప్పాడు.