- సెంటర్లలో కొన్న వడ్లు 4.36 లక్షల మెట్రిక్ టన్నులు
- రూ. 997 కోట్లు రైతుల
- ఖాతాల్లో జమ సన్నాలకు రూ. 50 కోట్ల బోనస్
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో వానకాలం సీజన్వడ్ల కొనుగోలు పూర్తయ్యింది. ప్రభుత్వం రైతుల నుంచి రూ. 1,013 కోట్ల విలువైన 4 లక్షల 36 వేల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో ఎలాంటి సమస్యలు లేకుండా కొనుగోళ్లు జరిగాయి. చాలావరకు రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమయ్యాయి. ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తితే కలెక్టర్ఆశిశ్ సంగ్వాన్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. జిల్లాలో ఈ సీజన్లో 3 లక్షల 14వేల ఎకరాల్లో వరి సాగయ్యింది. 5.6 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. ప్రభుత్వం 424 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసింది.
అక్టోబర్‌లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కొందరు రైతులు తమ వడ్లు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోగా .. శనివారం వరకు 4 లక్షల 36 వేల మెట్రిక్ టన్నుల వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో రూ. 764 కోట్ల విలువైన 3.36 లక్షల మెట్రిక్ టన్నులుదొడ్డు రకం వడ్లున్నాయి.
1,06,700 మెట్రిక్ టన్నుల సన్న వడ్లు కొన్నారు. వీటి విలువ రూ. 233 కోట్లు. శనివారం వరకు రైతుల అకౌంట్లలో రూ. 997 కోట్లు జమ అయ్యాయి. మిగిలిన రైతులకు 2,3 రోజుల్లోనే పేమెంట్ జరగనుంది. ట్రాన్స్ పోర్ట్ సమస్యలేకుండా ఎప్పటికప్పుడు సెంటర్ల నుంచివడ్లను మిల్లులకు తరలించారు. రైసుమిల్లు నుంచి వెంటనే ట్రక్‌షీట్ తెప్పించి ఆన్లైన్లో ఎంట్రీ చేయడంవల్ల చెల్లింపులు వేగంగా జరిగాయి.
సన్న వడ్లు సాగు చేసే రైతులను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ఇచ్చింది. ప్రభుత్వ సెంటర్లలో సన్నవడ్లు అమ్మిన 15,852 మంది రైతులకు రూ. 50.20 కోట్లు బోనస్‌గా చెల్లించారు. దీంతో యాసంగిలోనూ సన్నరకం వడ్ల సాగు పెరిగే అవకాశముంది.
రూ.56 వేల బోనస్ వచ్చింది
4 ఎకరాల్లో సన్నవడ్లు సాగుచేశా. 112 క్వింటాళ్ల దిగుబడి వస్తే ప్రభుత్వ సెంటర్లో అమ్మాను. మద్దతు ధర కాకుండా రూ.56వేలు బోనస్‌గా వచ్చింది. అరీఫ్, రైతు, లింగంపేట