సన్నబియ్యం కొనుగోళ్లు, వడ్ల అమ్మకాల్లో రూ. వెయ్యి కోట్ల అవినీతి : కేటీఆర్

సన్నబియ్యం కొనుగోళ్లు, వడ్ల అమ్మకాల్లో రూ. వెయ్యి కోట్ల అవినీతి : కేటీఆర్
  •  కాంగ్రెస్ అంటేనే స్కాములు 
  • మార్కెట్​లో సన్నబియ్యం కిలో రూ.42కే దొరుకుతున్నయ్​​
  • కిలోకు రూ.57 చెల్లించి ఎందుకు కొంటున్నరు?
  • బియ్యం కొనుగోళ్లలో రూ.300 కోట్ల అవినీతి.. 
  • వడ్ల స్కామ్​లో క్వింటాకు రూ.230 చొప్పున దోపిడీ
  • ఇందులో రూ.700 కోట్ల కుంభకోణం..ఆధారాలతో కోర్టుకు పోతామని వెల్లడి

15 రోజుల నుంచి తాము ఈ అంశంపై నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నప్పటికీ సీఎం రేవంత్‌‌గానీ, మంత్రి ఉత్తమ్‌‌గానీ స్పందించకపోవడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణ భవన్‌‌లో  కేటీఆర్​ మీడియాతో మాట్లాడారు. గల్లీలో దోచుకో, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చుకో అనే ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. వడ్ల అమ్మకం, సన్న బియ్యం కొనుగోళ్ల అవినీతిలో సీఎం పేషీ హస్తం కూడా ఉందని ఆరోపించారు. 

వడ్ల అమ్మకంలో భారీ దోపిడీ

తమ సర్కార్ ఉన్నప్పుడు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు గోదాముల్లో, రైస్ మిల్లర్ల దగ్గర ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ‘‘ఈ వడ్లను అమ్మడానికి మూడు నెలల క్రితం కాంగ్రెస్ సర్కార్ గ్లోబల్ టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో 4 కంపెనీలు బిడ్ వేశాయి. క్వింటాకు రూ.1,885 నుంచి రూ.2,007కు వడ్లు కొనడానికి ఆయా సంస్థలు ముందుకొచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వం వారికి కాంట్రాక్టు అప్పగించింది. మూడు నెలల్లో వడ్లు తీసుకుని మొత్తం రూ.7,500 కోట్లు కట్టాలని కాంట్రాక్టు నిబంధనల్లో పేర్కొన్నారు.

 కానీ, ఇప్పటివరకు 20 శాతం వడ్లను కూడా వాళ్లు తీసుకుపోలేదు. వడ్లు ఇవ్వలేకపోతే క్వింటాకు రూ.2,230 చెల్లించాలని సదరు కాంట్రాక్టు సంస్థలు రైస్ మిల్లర్లను ఒత్తిడి చేస్తున్నాయి. ఒక్కో క్వింటాకు సుమారు రూ.230 చొప్పున ఎక్కువ ఇవ్వాలని, లేకపోతే విజిలెన్స్ దాడులు చేయిస్తామని మిల్లర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ స్కామ్‌‌లో క్వింటాకు రూ.230 చొప్పున, సుమారు రూ.700 కోట్ల అవినీతి జరుగుతోంది. 

అదనంగా వసూలు చేస్తున్న రూ.230లో, రూ.150 చొప్పున కాంగ్రెస్ సర్కార్‌‌‌‌ పెద్దలకు వెళ్తున్నది. జలసౌధలో జరిగిన మీటింగ్‌‌లో ఈ మేరకు కాంట్రాక్టర్లతో మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌‌‌రెడ్డి ఎంవోయూ కుదుర్చుకున్నారు.” అని కేటీఆర్ ఆరోపించారు. వాస్తవానికి ప్రభుత్వం దగ్గర్నుంచి రూ.2,100 క్వింటా చొప్పున చెల్లించి వడ్లు కొనుగోలు చేయడానికి రైస్ మిల్లర్లే ముందుకొచ్చారని, వారికి ఇవ్వని ప్రభుత్వం, అంతకంటే రూ.200 తక్కువకు వడ్లను తమ అనుయాయులకు అమ్ముతున్నదన్నారు. ఈ కాంట్రాక్టు దక్కించుకున్న కేంద్రీయభండార్ అనే సంస్థను తాము అధికారంలో ఉన్నప్పుడు బ్లాక్ లిస్టులో పెడితే, కాంగ్రెస్ వచ్చాక బ్లాక్ లిస్టులో నుంచి తీసేసి, ఆ కంపెనీకే కాంట్రాక్టు ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు.

కిలోకు రూ.15 అదనంగా చెల్లిస్తున్నరు

వడ్ల కుంభకోణంలో ఉన్న నాలుగు సంస్థలకే సన్న బియ్యం కొనుగోళ్ల కాంట్రాక్టును కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. మార్కెట్‌‌లో రూ.42 నుంచి రూ.45కు కిలో సన్న బియ్యం దొరుకుతున్నాయని, రాష్ట్ర సర్కారు మాత్రం రూ.57కు కిలో సన్న బియ్యం కొనుగోలు చేస్తున్నదన్నారు. ఒక్కో కిలోకు రూ.15 చొప్పున అధికంగా కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నదని, ఈ మొత్తం వ్యవహారంలో రూ.300 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందన్నారు. 

‘‘మధ్యాహ్న భోజన స్కీమ్ కోసం 2.2 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోళ్లకు సివిల్ సప్లైస్ డిపార్ట్‌‌మెంట్ టెండర్ వేసింది. వడ్ల కుంభకోణంలో ఉన్న నాలుగు కంపెనీలే, ఇందులోనూ బిడ్ దాఖలు చేశాయి. బహిరంగ మార్కెట్‌‌లో సన్న బియ్యం ధరలు కిలో రూ.42 నుంచి 45 ఉంది. కానీ, ఆ నాలుగు సంస్థల్లో ఒకరు రూ.57కు కిలో కోట్ చేయగా, మిగిలిన మూడు సంస్థలు రూ.56.90కి కిలో చొప్పున సరఫరా చేస్తామని కోట్ చేశాయి. వాళ్లకే సర్కార్ కాంట్రాక్టు ఇచ్చింది. దాదాపు రూ.15 ఎక్కువకు కాంట్రాక్టు కట్టబెట్టింది. దాదాపు రూ.300 కోట్ల దోపిడీ జరిగింది.” అని కేటీఆర్​ వివరించారు.

 వాస్తవానికి ప్రభుత్వం వద్ద ఉన్న సన్న వడ్లను మిల్లర్లకు ఇస్తే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లక్ష టన్నుల సన్న బియ్యం వస్తాయని కేటీఆర్ అన్నారు. కానీ, ఆ వడ్లను అగ్గువకు అమ్మేసి, అదే సంస్థల నుంచి అధిక ధరకు బియ్యం కొనుగోలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తాము అధికారంలో ఉన్నప్పుడు వడ్లను మిల్లర్లకు ఇచ్చి, వారి నుంచి బియ్యం తీసుకుని వాటినే మధ్యాహ్న భోజనం కోసం ఉపయోగించుకున్నామన్నారు. తద్వారా రాష్ట్ర ఖజానాకు డబ్బులు మిగిలాయని ఆయన చెప్పారు.

కోర్టుకు పోతం

వడ్లు, బియ్యం కుంభకోణంలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ ఆదేశాలు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి పనులు చేస్తాడని తాను అనుకోవడం లేదన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జీతో ఎంక్వైరీ చేయించాలని సవాల్ చేశారు. ఈ అంశంలో బీజేపీ వ్యవహారం కూడా అనుమానాస్పదంగా ఉందని కేటీఆర్ అన్నారు. బియ్యం, వడ్ల వ్యవహారంలో తప్పు జరిగిందని రాష్ట్ర బీజేపీ అంటుంటే, కేంద్ర సర్కార్ ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్​ ప్రశ్నించారు. 

వడ్లు, బియ్యం వ్యవహారమంతా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్‌‌సీఐ చూస్తున్నదని, ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే ఎఫ్‌‌సీఐ ఎందుకు ఇన్‌‌వాల్వ్‌‌ కావడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై వెంటనే ఎఫ్‌‌సీఐ స్పందించాలని, ఈడీకి ఫిర్యాదు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తాము పూర్తి ఆధారాలతో కోర్టుకు వెళ్తామని, ఏజెన్సీలకు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.