వడ్ల కొనుగోళ్లు కంప్లీట్

వడ్ల కొనుగోళ్లు కంప్లీట్
  •     కామారెడ్డి జిల్లాలో రూ.687 కోట్ల విలువైన వడ్ల కొనుగోళ్లు
  •     అకౌంట్లలో ఇప్పటికే రూ.645 కోట్లు జమ
  •     సెంటర్లలో ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ చేసిన ఉన్నతాధికారులు
  •      350 సెంటర్లలో కొనుగోళ్లు

కామారెడ్డి​, వెలుగు :  కామారెడ్డి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. ఇప్పటివరకు రూ. 687 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొనుగోళ్ల కోసం జిల్లాలో సొసైటీల ఆధ్వర్యంలో  327 సెంటర్లు,  ఐకేపీ తరఫున 23 సెంటర్లు మొత్తం 350 సెంటర్లు ఏర్పాటు చేశారు.   యాసంగి సీజన్​లో  2 లక్షల 68 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా..  5 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తుందని యంత్రాంగం అంచనా వేసింది.  పరిస్థితుల ప్రభావంతో దిగుబడి తగ్గింది. మార్చి 26 నుంచి కొనుగోళ్లు ప్రారంభించగా..  

ఆయా ఏరియాల్లో వరి కోతలకు అనుగుణంగా సెంటర్లను తెరిచారు. శనివారం నాటికి 54,492 మంది రైతుల నుంచి  3,12,492 మెట్రిక్​ టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. ఇప్పటికే ఆయా సెంటర్ల నుంచి స్టాక్​ను మిల్లులకు తరలించారు. 14 సెంటర్లలో మాత్రమే స్టాక్​ ఉంది.  ఇది కూడా 2 రోజుల్లో పూర్తి స్థాయిల్లో మిల్లులకు లిప్టు కానుంది.  రూ.687 కోట్ల విలువైన వడ్లను కొనుగోలు చేయగా ఇప్పటికే రైతుల అకౌంట్లలో  రూ. 645 కోట్లు జమ అయ్యాయి.

 50 వేల మెట్రిక్​టన్నుల వడ్లను రైతులు బయటి మార్కెట్లో అమ్ముతున్నట్లు అంచనా.  ఇందులో ప్రధానంగా సన్న వడ్లు బయటి మార్కెట్లో విక్రయించారు. మరి కొంత దిగుబడిని రైతులు తమ దగ్గర నిల్వ ఉంచుకున్నారు.  

సవ్యంగా  కొనుగోళ్లు

అక్కడక్కడ చిన్న పాటి సమస్యలు మినహా వడ్ల కొనుగోళ్లు జిల్లాలో సవ్యంగా  జరిగాయి.    అకాల  వర్షాలతో  కొన్ని సెంటర్లలో  వడ్లు తడిసిపోయాయి. తడిసిన వడ్లను కూడా అధికారులు కొనుగోలు చేశారు.  సెంటర్లకు వచ్చిన వడ్లను కాంట పెట్టడం,  ఇక్కడి నుంచి మిల్లులకు తరలించే ప్రక్రియ వేగవంతంగా జరిగే విధంగా  జిల్లా ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించారు.   కలెక్టర్​ జితేశ్ వి పాటిల్​, అడిషనల్​ కలెక్టర్​ చంద్రమోహన్​ తో పాటు,  సివిల్​ సప్లయ్​, రెవెన్యూ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షించారు.

సమస్యలు ఏర్పడిన సెంటర్లు, కాంటలు డిలే అవుతున్న సెంటర్లను గుర్తించి స్పెషల్​ ఫోకస్​ చేశారు. సెంటర్లలో ఆఫీసర్లు మకాం వేసి లారీలు తెప్పించి వడ్లను మిల్లులకు తరలించారు.  నిరంతరం ఆఫీసర్లు,  మిల్లర్లు, ట్రాన్స్​ఫోర్ట్​ కాంట్రాక్టర్లతో మీటింగ్​లు నిర్వహించి కొనుగోళ్లు సవ్యంగా జరిగే విధంగా సూచనలు, సలహాలు ఇచ్చారు.   స్టేట్​ గవర్నమెంట్​ కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు స్పెషల్ సెక్రటరీ శరత్​ను జిల్లాకు స్పెషల్​ ఆఫీసర్​గా నియమించారు.

జిల్లాలో పర్యటించి సెంటర్లను పరిశీలన చేయటం,  రివ్యూ మీటింగ్​లు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.  నిజాంసాగర్​, బీబీపేట మండలాల్లో కాంటలు డిలే అవుతున్నాయంటూ రైతులు రోడ్డెక్కగా..  ఆఫీసర్లు వెళ్లి అక్కడి సమస్యలు పరిష్కరించి  కాంటలు స్పీడప్​ చేశారు.   కాంట అయిన 3 రోజుల్లో  రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేశారు.  

సమస్యలు లేకుండా కొనుగోళ్లు

రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్లను కొనుగోలు చేశాం.   సేకరించిన వడ్లకు సంబంధించి ఇప్పటికే 98 శాతం ట్యాబ్​ ఎంట్రీ జరిగింది.  ట్యాబ్​ ఎంట్రీ జరిగిన వెంటనే రైతుల అకౌంట్లలో పైసలు జమ అయ్యాయి. ఇప్పటికే రూ.645 కోట్లు రైతుల అకౌంట్లలో వేశాం.   ఇంకా 14 సెంటర్లలో వడ్ల నిల్వలు ఉన్నాయి. వాటిని కూడా వెంటనే మిల్లులకు తరలిస్తాం.

– చంద్రమోహన్​, అడిషనల్​ కలెక్టర్​