తెలంగాణలో 23 లక్షల టన్నుల వడ్లు కొనుగొళ్లు

తెలంగాణలో 23 లక్షల టన్నుల వడ్లు కొనుగొళ్లు
  • నిరుడు యాసంగితో పోలిస్తే రెట్టింపు కొనుగోళ్లు
  • రూ.4,500 కోట్ల విలువైన ధాన్యం సేకరణ
  • ఇప్పటికే రూ.3వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ
  • నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా కొనుగోళ్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా యాసంగి వడ్ల కొనుగోళ్లు 23లక్షల టన్నులు దాటాయి. 7,133 సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. నిరుడు యాసంగిలో ఈ టైమ్​కు 9 లక్షల టన్నుల వడ్లు మాత్రమే కొనుగోలు చేయగా.. ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో కొనుగోళ్లు జరిగాయి. రోజుకు లక్ష టన్నులకు పైగా ధాన్యం కొంటున్నట్టు సివిల్ సప్లయ్స్ డిపార్ట్​మెంట్ అధికారులు చెప్తున్నరు. 

ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో వెంట వెంటనే జమ అవుతున్నాయి. గతంలో వడ్లు అమ్ముకున్న తర్వాత ఖాతాలో డబ్బులు పడాలంటే 20 నుంచి నెల రోజులు పట్టేది. కానీ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు సివిల్ సప్లయ్స్ డిపార్ట్​మెంట్ అధికారులు చెల్లింపులు స్పీడ్​గా చేస్తున్నరు. ధాన్యం అమ్ముకుని ట్రాక్​షీట్​లో నమోదై.. ఓపీఎంఎస్​లో ఎంటరైన తర్వాత వెంటనే డబ్బులు ఖాతాలో జమ అయ్యేలా సివిల్ సప్లయ్స్ కమిషనర్ చర్యలు చేపట్టారు. 

ఇప్పటి దాకా రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల మంది రైతుల నుంచి రూ.4,500 కోట్లు విలువ చేసే వడ్లు సేకరించారు. ఇప్పటికే రూ.3వేల కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని సివిల్ సప్లయ్స్ అధికారులు తెలిపారు. ఇంకా రూ.1,500 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని చెప్పారు. రైతుల వివరాలు ఓపీఎంఎస్​లో రిజిస్టర్ అయిన 48 గంటల్లోనే డబ్బులు ఖాతాల్లో జమ అవుతున్నాయి. 

డబ్బుల చెల్లింపులో నిజామాబాద్ టాప్​

నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా రూ768.30 కోట్లకు పైగా విలువైన ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో రూ.620 కోట్లకు పైగా విలువైన వడ్లు కొన్నరు. సూర్యాపేట జిల్లాలో రూ.390.05 కోట్లు, కామారెడ్డి జిల్లాలో రూ.360.08 కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.315.42 కోట్లు, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రూ.200 కోట్లకు పైగా విలువైన ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. డబ్బుల చెల్లింపులోనూ నిజామాబాద్ టాప్​లో ఉన్నది. 53వేలకు పైగా రైతులకు రూ.542 కోట్లు ఇప్పటికే అందాయి. 45 వేల మంది నల్లొండ జిల్లా రైతులకు రూ.490 కోట్లు, కామారెడ్డి జిల్లాలో రూ.264 కోట్లకు పైగా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.