- సంపదను లెక్కించేందుకు 72 రోజులు పట్టే చాన్స్
- 46 ఏండ్ల తర్వాత తెరుచుకున్న జగన్నాథుడి ఖజానా
- ప్రత్యేక పూజలు చేసి లోనికి ప్రవేశించిన ప్రత్యేక కమిటీ
- రహస్య గదిలోకి వెళ్లిన 11 మంది సభ్యుల బృందం
పూరీ : దేశవ్యాప్తంగా భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సందర్భం వచ్చేసింది. 46 ఏండ్ల తర్వాత ఒడిశాలోని 12వ శతాబ్దంనాటి ప్రపంచ ప్రసిద్ధ పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం ఓపెన్ అయ్యింది. ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 1.28 గంటలకు ఒడిశా సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలోని 11 మంది సభ్యులు రత్న భాండాగారంలోకి ప్రవేశించారు. ట్రెజరీలోకి ప్రవేశించిన వారిలో కమిటీ చైర్మన్, ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి బిశ్వనాథ్‌రథ్, ఆ కమిటీ సభ్యుడు సీబీకే మహంతి, టెంపుల్ అడ్మినిస్ట్రేటర్ అరవింద పాడి, పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్, పురావస్తుశాఖ ఇంజినీర్ ఎన్‌సీ పాల్, సూపరింటెండెంట్డీబీ గడనాయక్, పూరీ రాజప్రతినిధి గజపతి మహరాజాతో పాటు నలుగురు ఆలయ సేవాయత్‌లు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. సంపదను లెక్కించడంతోపాటు భాండాగారానికి రిపేర్లు చేసేందుకు ఇందులోకి ప్రవేశించినట్టు చెప్పారు. లోపల విషసర్పాలు ఉంటాయన్న అనుమానాల నేపథ్యంలో పూరీ రత్న భాండాగారంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
జగన్నాథుడి అనుమతి తీసుకొని లోనికి..
రత్న భాండాగారాన్ని తెరిచే ముందు జగన్నాథుడి శ్రీ క్షేత్రంలో ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. గుండిచా మందిరానికి వెళ్లి జగన్నాథుడి పర్మిషన్ తీసుకున్నారు. 4.5 ఫీట్ల పొడవు, 2.5 ఫీట్ల ఎత్తు, 2.5 ఫీట్ల వెడల్పుతో టేకుతో ప్రత్యేకంగా తయారుచేయించిన ఆరు భారీ చెక్కపెట్టెలను తీసుకొని కమిటీ సభ్యులు లోనికి ప్రవేశించారు. గదిలో సర్పాలు ఉన్నాయనే అనుమానంతో ముందుజాగ్రత్తగా స్నేక్ హెల్ప్‌లైన్, 40 మందితో కూడిన ఓడీఆర్ఏఎఫ్ బృందాలను ఆలయం బయట రెడీగా ఉంచారు. అవసరమైతే వీరిని లోపలికి తీసుకెళ్లనున్నారు. కాగా, శ్రీక్షేత్రంలో జగన్నాథుడికి నిత్యం జరిగే 119 మూలికా సేవలకు అంతరాయం కలగకుండా భాండాగారం తెరిచేందుకు అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు. రత్న భాండాగారాన్ని చివరిసారిగా 1978లో తెరిచారు.
సంపదనంతా వెంటనే బయటకు తీసుకురాం: అరవింద పాడి
భాండాగారాన్ని తెరిచినా.. సంపదనంతా వెంటనే బయటకు తీసుకురాబోమని టెంపుల్అడ్మినిస్ట్రేటర్ అరవింద పాడి తెలిపారు. ట్రెజరీ లోపలి, బయటి గదుల్లో ఉంచిన ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను చెక్కపెట్టెలతో కూడిన తాత్కాలిక స్ట్రాంగ్ రూంకు తరలించనున్నట్టు చెప్పారు. తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌ను గుర్తించామని, సీసీ కెమెరాలతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సంపదను కనుగొనే పని నేడే ప్రారంభమైందని, గవర్నమెంట్ అనుమతి రాగానే స్వర్ణకారులు, ఇతర నిపుణుల సహకారంతో లెక్కింపు ప్రారంభిస్తామని చెప్పారు. ట్రెజరీకి మరమ్మతులు, భద్రత కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. సంపద లెక్కింపు తర్వాత రత్న భాండాగారంలోని విలువైన వస్తువుల బరువు, తయారీ వంటి వివరాలతో కూడిన డిజిటల్ కేటలాగ్‌ను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లించారు. కాగా, మొత్తం సంపద లెక్కింపునకు 72 రోజులు పట్టే చాన్స్ఉన్నదని అధికారులు అంచనా వేశారు.