తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ సమావేశంలో రూ. 2 లక్షల దాకా బ్యాంకు నుంచి రైతులు తీసుకున్న పంట రుణాల మాఫీపై ముందడుగు వేసింది. నియమ, నిబంధనల ఆమోదంతో పాటు రైతు భరోసా అమలు విషయంలో విధివిధానాల రూపకల్పనకు ఉపసంఘాన్ని వేసింది. ఈ రెండు రైతు సంక్షేమ పథకాల పూర్వాపరాలు గమనిస్తే బీఆర్ఎస్ తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వీటిని సృష్టించిందని తెలిసిపోతుంది. అయితే, ఆర్థికసాయం.. అన్నం పెడుతున్న రైతులకే కదా అని ఎవరూ వీటిని విమర్శించడం లేదు. కానీ, వీటిలోని లొసుగులను తొలగిస్తే ఈ పథకాలు సాగు జీవులకు నిజంగా మేలు చేస్తాయనేది వాస్తవం.
బ్యాంకుల్లోని పంట రుణాల మాఫీని పార్టీలు ఎన్నికల హామీగా వాడుకోవడంతో రెవెన్యూ రికార్డుల్లో భూమి ఉన్న ప్రతివారు బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకోవడం మొదలుపెట్టారు. 2009లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం, ఆ తర్వాత 2014, 2018లలో బీఆర్ఎస్ కూడా రాష్ట్రంలో రూ. లక్షలోపు పంట రుణాలు మాఫీ అనడంతో బ్యాంకు లోన్ కొన్ని వర్గాలకు ఉచిత ఆదాయ మార్గమైంది. పంట అప్పే కదా.. తీసుకున్నాక ఏదో రోజు మాఫీ అవుతుందనే ధీమాతో చాలామంది తిరిగి చెల్లించడం కూడా మానేశారు. ఇక్కడే పంట రుణమాఫీ దుర్వినియోగానికి తెర లేచింది. అసలు ఆ భూముల్లో పంటలు వేస్తున్నారా లేదా అనే క్షేత్ర పర్యవేక్షణ చేసే ఓపిక, సమయం బ్యాంకుల వద్ద లేదు. బ్యాంకు దృష్టిలో లోన్ అడిగేవారు పట్టాదారు అయితే చాలు. వారికి అప్పు వినియోగం కన్నా సెక్యూరిటీ ముఖ్యం.
బ్యాంకుల లక్ష్యాల కోసం రుణాలు
వ్యవసాయ రుణాల లక్ష్యాలు చేరేందుకు బ్యాంకులు భూయజమానులందరికి పంట రుణాలు ఇస్తున్నాయి. సదరు వ్యక్తి చెప్పిన పంటను లేదా ఆ ప్రాంతంలో అధికంగా పండించే పంటను రాసుకుని, ఎకరానికెంతో లెక్కించి డబ్బు చేతిలో పెడుతున్నాయి. బ్యాంకు అప్పు ఇచ్చింది అంటే ఆ భూమిలో పంట వేసినట్లు కానే కాదు. స్వల్పకాలిక పంటలు వేసే అవకాశం లేని మామిడి, నారింజ తదితర పండ్ల తోటలు కూడా ఇందులో ఉంటున్నాయి. ప్లాట్లు చేసి అమ్ముతున్న భూములు రెవెన్యూ రికార్డుల్లో మార్చేదాకా రుణ యోగ్యత కోల్పోవు. బ్యాంకు లెక్కల ప్రకారం రుణమాఫీ చేస్తే పంటలు వేయని భూములకు కూడా మాఫీ లభిస్తోంది. ఇలా కోట్లాది రూపాయలు పంట రుణాల మాఫీలో జారిపోతున్నాయి. పంటలు వేసిన భూములకే రుణమాఫీ దక్కేలా రెవెన్యూ సిబ్బంది ద్వారా నిజానిజాలు సేకరించాలి. వారి ధృవీకరణ లేనిదే బ్యాంకు రుణమాఫీ జాబితాలో పేరు చేర్చకూడదు. గూగుల్ మ్యాపుల ఆధారంగా కూడా ఈ వివరాలు రాబట్టుకోవచ్చు. ఈ పథకాల సక్రమ వినియోగం గురించి రైతు నేతల నుంచి ఎన్నో సూచనలు వచ్చాయి. రైతు సంక్షేమ పథకాల రచన, వాటి అమలుకు సంబంధించిన ఉప సంఘాల్లో రైతు నేతలకు, అన్ని రాజకీయ పక్షాలకు కూడా చోటు కల్పించాలి. ప్రజాధనానికి ట్రస్టీలుగా ఉన్న ప్రభుత్వాలు వృథాను తగ్గించే విధంగా పనిచేయాలి.
రైతుబంధు నిధులు దుర్వినియోగం
రైతుబంధు విషయానికొస్తే దీనిలో ప్రభుత్వ నిధులు పెద్దఎత్తున దుర్వినియోగం అవుతున్నాయి. భూమి ఉన్నవాడే రైతు, ఎన్ని ఎకరాలున్నా రైతే. ఏ ఉద్యోగం చేసినా రైతే, ఎమ్మెల్యే, మంత్రి, చివరకు ముఖ్యమంత్రి అయినా రైతే. ప్రతి భూయజమాని ఏ కొలమానాలు లేకుండా 'రైతు బంధు'కు అర్హుడే. ఇదీ ఆ పథక సృష్టికర్త కేసీఆర్ అన్ని ప్రశ్నలకు పదే పదే చెప్పిన ఏకైక సమాధానం. 'అంత పైసలు ఎక్కువైతే సర్కారుకు వాపసు ఇచ్చేయవచ్చు' అని కొసమెరుపు కూడా విన్నవించారు. కాంగ్రెస్ రైతుబంధును ఎకరానికి రూ. 10 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. కేవలం ఓట్ల గుడ్లు పెట్టే రైతుబంధు పథకం ప్రజాధనాన్ని తారస్థాయిలో పక్కదారి పట్టించింది. వెంచర్లు పెట్టి అమ్ముతున్న భూమికి కూడా రైతుబంధు అందుతున్న రుజువులు న్నాయి. దీన్ని కట్టడి చేసేలా భూ యజమానుల్లో ఉన్నత వర్గాలను, ఉన్నతోద్యోగులను, ఇతర ఆదాయ వనరులు ఉన్నవారికి రైతు భరోసా ఆపివేస్తామని సీఎం రేవంత్ కొంత స్పష్టతనిచ్చారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా 'రైతు భరోసా' విధివిధానాలు నిర్ణయించేటప్పుడు పూర్తి వివరాలతో, తెగువతో ముందడుగు వేయాలి. రైతుబంధులోని అనర్హులను కచ్చితంగా తొలగించాలి.
ఉత్తమ పథకాన్నే కొనసాగించాలి
రాబోయే ఎన్నికల్లో వారి ఓట్లు రాక పార్టీకి నష్టం రావచ్చు అని అసలే భావించకూడదు, భయపడకూడదు. అన్యాయంగా వస్తున్న సొమ్ముకు ఆశపడకుండా ప్రతి పౌరుడు నిజాయితీగా, చిత్తశుద్ధితో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. భూమి ఉందని పంటలు వేయకున్నా మాఫీకోసం బ్యాంకు రుణం తీసుకోవడం, రైతు భరోసా కూడా ఆశించడం సాంఘిక నేరమే. ఇందులో ఏదీ కౌలు రైతులకు దక్కకపోవడం పూర్తిగా
అమానవీయ చర్యనే.
ఈ రెండు పథకాల కొనసాగింపు అవసరమా! ఏదో ఒకటి సరిపోదా! రెండు పథకాలు రైతులను ఉద్దేశించినవే కాబట్టి ఈ రెంటిలో ఏది ఉత్తమమో భావించి ఏదో ఒకదానిని మాత్రమే కొనసాగించాలి. ప్రస్తుత ప్రభుత్వమైనా ఈ పథకాల విధి విధానాలలో సరయిన సంస్కరణలు తేవాలని తెలంగాణా సమాజం కోరుకుంటోంది. బడ్జెట్ లో సుమారు పావలా వంతు సొమ్మును వీటికి కేటాయిస్తుంటే ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు, కాదనడం లేదు. కానీ, అనర్హులకు ప్రజాధనం పోతుంటే ప్రతి పౌరుడు బాధపడుతున్నాడు. ఈ సంక్లిష్ట సమయంలో ప్రభుత్వంనిక్కచ్చిగా వ్యవహరిస్తే ప్రస్తుత ఆర్థికలోటు తగ్గి మిగతా హామీలకు వెసులుబాటు కలుగుతుంది.
- బి.నర్సన్,
విశ్రాంత
గ్రామీణ బ్యాంకు అధికారి