పురుషోత్తపట్నంలో మళ్లీ రెచ్చిపోయిన ఆక్రమణదారులు

  • భద్రాద్రి దేవస్థాన అధికారులపై వరుస దాడులు
  • ఏఈవో భవానీ రామకృష్ణకు గాయాలు  
  • మీడియాపైనా అటాక్..​

భద్రాచలం, వెలుగు : తెలంగాణ–-ఆంధ్రా సరిహద్దుల్లోని విలీన ఆంధ్ర ఎటపాక మండలం పురుషోత్తపట్నం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం భూముల్లో ఆక్రమణదారులు బరితెగిస్తున్నారు. ఆంధ్రా అధికారుల అండదండలతో ఆక్రమణలు అడ్డుకోవడానికి వెళ్లిన ఆలయ సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు. ఆదివారం గోశాల వద్ద ఈవో రమాదేవి ఆధ్వర్యంలో హరితహారం నిర్వహిస్తుండగా దాడి చేశారు. 

పోలీసులు ఉన్నా అక్కడి నుంచి వస్తున్న ఈవో, సిబ్బందిపై రాళ్లు రువ్వారు. సోమవారం మళ్లీ భవన నిర్మాణం చేపడుతున్నారని సమాచారం రావడంతో ఈఈ రవీందర్​, ఏఈవోలు భవానీ రామకృష్ణ, శ్రావణ్​కుమార్​ సిబ్బందితో కలిసి ఆపడానికి వెళ్లారు. అక్కడే ఉన్న ఆక్రమణదారులు కర్రలతో కొట్టడంతో పాటు పిడిగుద్దులు కురిపించారు. దీన్నంతా  కవర్ ​చేస్తున్న మీడియా ప్రతినిధులపైనా దాడికి దిగారు. సెల్​ఫోన్లు లాక్కున్నారు. ఏఈవో భవానీ రామకృష్ణను మెడపై కొట్టారు. విషయం తెలుసుకున్న ఈవో రమాదేవి ఎటపాక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 

ఆక్రమణదారులు తమపై దాడులకు పాల్పడుతున్నారని, దేవుడి భూములను ఆక్రమించుకుంటున్నారని కంప్లయింట్​లో పేర్కొన్నారు. ఈవో మాట్లాడుతూ..పురుషోత్తపట్నంలోని శ్రీసీతారామచంద్రస్వామి భూములపై దేవస్థానానికి అనుకూలంగా స్థానిక, జిల్లా, లాండ్​ సెటిల్​మెంట్​ కోర్టులు, ట్రిబ్యునల్, హైకోర్టుల్లో 260 జడ్జిమెంట్లు ఉన్నాయన్నారు. 900 ఎకరాల భూమి పాస్​పుస్తకాలు, ఆన్​లైన్​లో యాజమాన్య హక్కులతో పాటు అనుభవదారులుగా శ్రీ సీతారామచంద్రస్వామి ఉన్నారన్నారు. పురుషోత్తపట్నం భూములపై పూర్తి హక్కులు దేవస్థానానికే ఉన్నాయంటూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్నారు.