- మొదలైన నాగోబా సందడి
పుష్యమాసం జాతరల మాసం. ఈ నెలలో గిరిజన బిడ్డలు వారి సాంప్రదాయాలను పాటిస్తూ.. కుల దేవతలను పూజిస్తూ అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాలను పాటిస్తారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నాగోబా జాతర జరుగుతుంది.
ఆదిలాబాద్ అంటేనే అడవులు.. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు గుర్తుకొస్తాయి. కానీ.. ఇక్కడ ఆదివాసీల జాతర్లు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. వాళ్లు చేసుకునే ప్రతి జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా అవన్నీ పుష్యమాసంలో మొదలవుతాయి. అందుకే ఈ నెలను ఆదివాసీలు పవిత్రంగా భావిస్తారు. రెండు నెలల పాటు పుడమి పులకరించేలా వైభవంగా ఉత్సవాలు చేస్తారు. వందల ఏండ్ల చరిత్ర ఉన్న ఆ ప్రకృతి పండుగల విశేషాలు.
మెస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరిగే ఈ నాగోబా జాతర రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి ఏడాది పుష్యమాసం అమావాస్య రాత్రి మెస్రం వంశీయులు పవిత్ర గంగాజలాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ప్రారంభిస్తారు. ఈనెల 28న రాత్రి ప్రత్యేక పూజలతో జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతరలో కొత్త కోడళ్ల బేటింగ్ కార్యక్రమం స్పెషల్ అట్రాక్షన్. నాగోబా జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. చివరి రోజు అధికారులు ప్రజాదర్భార్ నిర్వహించి ఆదివాసీల నుంచి వినతులుతీసుకుంటారు.
నువ్వుల నూనె తాగే ఆచారం
నాగోబా జాతర ప్రారంభానికి ముందు నార్నూర్ మండల కేంద్రంలో ఖాందేవ్ జాతర ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జనవరి 13న మొదలైన ఈ జాతర 27న ముగియనుంది. 15 రోజుల పాటు జాతర జరుగుతుంది. పూర్వ కాలంలో తొడసం వంశస్థుడైన ఖమ్ము పటేల్‌కు ఖాందేవుడు కలలో కనిపించి “మీ గ్రామం సుఖసంతోషాలతో ఉండాలంటే నీ పొలంలో కొలువైన నాకు పూజలు చేయాల’’ని చెప్పాడు. ఆ తర్వాత చూస్తే.. ఖమ్ము పటేల్ పొలంలో ఖాందేవుడు ఓ స్తంభంలా వెలిశాడు. అప్పటినుంచి ఏటా పుష్య పౌర్ణమి నుంచి తొడసం వంశీయులు ఖాందేవుడి జాతరను జరుపుతున్నారు. ఈ జాతరకు వచ్చిన ఆదివాసీలు చివరి రోజు నాగోబా జాతరకు వెళ్తారు. తొడసం ఆడపడుచుతో నువ్వుల నూనెను తాగించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి తొడసం ఆడపడుచు నాగుబాయి చందు ఏకంగా 2.5 కిలోల నువ్వుల నూనె తాగింది. ఇలా నూనె తాగడం వల్ల సంతానయోగం కలుగుతుందని ఇక్కడివాళ్ల నమ్మకం.
బుడుందేవ్.. మహాదేవ్ జాతర
నాగోబా జాతర ముగిసిన తర్వాత మెస్రం వంశీయులు ఉట్నూర్ మండలం శ్యాంపూర్‌లో బుడుందేవ్ జాతరను ప్రారంభిస్తారు. పూర్వంగౌరాపూర్ గ్రామంలో ఉన్న ఆవుల మందలో ఉన్న ఆంబోతు పశువుల మంద నుంచి తప్పించుకొని శ్యాంపూర్ ప్రాంతంలో ఉన్న చేలల్లో పడి పంట నాశనం చేసేది. దీంతో కొత్వాల్ ఆంబోతును చంపేస్తాడు. చనిపోయిన ఆంబోతును దూరంగా పడేయడానికి వెళ్తుండగా అక్కడే బండరాయిగా మారి బుడుందేవ్‌గా అవతరించిందని చరిత్ర చెబుతోంది. శ్యాంపూర్‌లో బుడుందేవ్ జాతర ముగిసిన తర్వాత సిర్పూర్(యు) మండల కేంద్రంలో మహాదేవ్ జాతరను ప్రారంభిస్తారు. ఆత్రం వంశీయులు ప్రత్యేక పూజలతో మహాదేవ్‌ను కొలుస్తారు. జాతర 15 రోజుల పాటు కొనసాగుతుంది.
జంగుబాయి జాతర
కెరమెరి మండలంలోని మహారాజ్ గూడ దగ్గర్లోని సహ్యాద్రి పర్వతాల్లోని గుహలో జంగుబాయి వెలిసింది. ఏటా పుష్య మాసంలో నెల రోజుల పాటు ఆదివాసీలు జంగుబాయిని కొలుస్తారు. ఈనెల 2న మొదలైన ఈ జాతర 28వ తేదీ వరకు జరగనుంది. అక్కడి గుహలో ఉండే పెద్దపులిని జంగో లింగో అంటూ జై కొడుతూ దర్శనం చేసుకుంటారు. చిమ్మచీకటిలో దీపం రూపంలో దేవత దర్శనం ఇస్తుంది.ఇక్కడికి తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. తుమ్మం, కొడప, సలాం, రాయిసిడాం, హెర్రె కుమ్ర, మరప, వెట్టి, మందడి.. ఇలా ఈ ఆలయంలో ఎనిమిది గోత్రాల కటోడాలు(పూజారులు) ఉంటారు.
– ఆదిలాబాద్, వెలుగు-