డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో కొత్త సర్కారు కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. డెహ్రాడూన్లోని పరేడ్ గ్రౌండ్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్.. పుష్కర్ ధామీతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు హాజరయ్యారు.
పుష్కర్ సింగ్తో పాటు 8 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ మినిస్టర్లలో సత్పాల్ మహరాజ్, సుబోధ్ ఉనియాల్, ధన్ సింగ్ రావత్, రేఖా ఆర్య, గణేశ్ జోషికి రెండోసారి అవకాశమిచ్చారు. చందన్ రామ్దాస్, సౌరభ్ బహుగుణ, ప్రేమ్ చంద్ అగర్వాల్లకు కొత్తగా ధామీ కేబినెట్లో చోటు దక్కింది. గురువారం కొత్త కేబినెట్ తొలిసారి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ధామీ ప్రకటించారు.
Tomorrow, March 24 we will have our first cabinet meeting...The upcoming decade will be Uttarakhand's, and we are determined to make it so. We'll start working from today for the development of our state: Pushkar Singh Dhami after taking oath as Uttarakhand CM for a second term pic.twitter.com/51QxQP9Tgu
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 23, 2022
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 70 నియోజకవర్గాల్లో బీజేపీ 47సీట్లలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే సీఎం అభ్యర్థి పుష్కర్ సింగ్ ధామీ మాత్రం ఓటమి పాలయ్యారు. దీంతో బీజేపీ హైకమాండ్ తర్జనభర్జనల అనంతరం మళ్లీ ఆయనకే పగ్గాలు అప్పజెప్పాలని నిర్ణయించింది. తాజాగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన పుష్కర్ ధామీ ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎంపిక కావాల్సి ఉంటుంది.