
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' మూవీ ఫుల్ రన్‍లో ప్రపంచవ్యాప్తంగా రూ.1871 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ క్రమంలో 'పుష్ప2' చిత్రానికి వచ్చిన లాభాలపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
న్యాయవాది నరసింహారావు ఈ పిల్ దాఖలు చేశారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు వల్ల.. పుష్ప2 మూవీకి భారీగా ఆదాయం వచ్చిందని.. ఆ డబ్బుని చిన్న చిత్రాల బడ్జెట్ రాయితీకి వినియోగించాలని పేర్కొన్నారు.
అలాగే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. జానపద కళాకారుల సంక్షేమానికి (పింఛను కోసం) పుష్ప 2కు వచ్చిన లాభాలను కేటాయించాలని న్యాయవాది నరసింహారావు తెలిపారు. బెనిఫిట్ షో, టికెట్ ధరలు పెంపునకు హోంశాఖ ప్రత్యేక అనుమతివ్వడానికి గల కారణాలేంటో చెప్పలేదని న్యాయస్థానానికి వివరించారు.
దాంతో ఇప్పటికే బెనిఫిట్ షోలు, టికెట్ల వసూలు ముగిసింది కదా అని హైకోర్టు సీజే ప్రశ్నించారు. దానికి సమాధానంగా హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వడం వల్ల పుష్ప 2కి వచ్చిన లాభం గురించే, పిటీషన్ దాఖలు చేశామని న్యాయవాది వెల్లడించారు. అయితే, అందుకు తగిన సుప్రీంకోర్టు తీర్పు కాపీని సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణ 2 వారాలకు వాయిదా వేశారు హైకోర్టు సీజే.