మైత్రి మూవీస్ రూ.50 లక్షల సాయం

మైత్రి మూవీస్  రూ.50 లక్షల సాయం
  • శ్రీతేజ్  నాన్నకు చెక్కు అందించిన నిర్మాత నవీన్
  • ఈ ఘటనను ఇక రాజకీయం చేయొద్దు: మంత్రి కోమటిరెడ్డి
  • సినీ ప్రముఖుల ఇండ్లపై దాడులు కరెక్టు కాదని కామెంట్

సికింద్రాబాద్, వెలుగు: సంధ్య థియేటర్​ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి పుష్ప–-2 సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్  రూ.50 లక్షల సాయం అందించింది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆ చిత్ర నిర్మాత నవీన్.. శ్రీతేజ్  తండ్రి భాస్కర్ కు రూ.50 లక్షల చెక్కును అందించారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్​ కిమ్స్  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను మంత్రి వెంకట్ రెడ్డితో కలిసి నవీన్  సోమవారం  పరామర్శించారు.

 బాలుడి తండ్రి భాస్కర్ కు చెక్కు అందించిన తర్వాత మంత్రి మాట్లాడారు. బాలుడు శ్రీతేజ్​ ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నానని ఆయన చెప్పారు. బాబు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని డాక్టర్లు చెప్పారని, అతను త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, అయితే ఈ విషయాన్ని ఇక రాజకీయం చేయవద్దని మంత్రి కోరారు. సినిమా ప్రముఖుల ఇండ్లపై దాడులు చేయడం కరెక్టు​కాదన్నారు. నటుల ఇండ్లపై దాడులు చేస్తే  చట్టం ఊరుకోదని, కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. 

నిలకడగా శ్రీతేజ్  హెల్త్

శ్రీతేజ్​ ఆరోగ్య పరిస్థితులపై కిమ్స్​ డాక్టర్లు సోమవారం హెల్త్​ బులెటిన్  విడుదల చేశారు. బాలుడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వెంటిలేటర్  సహాయం లేకుండానే ఊపిరి తీసుకుంటున్నాడని డాక్టర్​ చేతన్, డాక్టర్ విష్ణుతేజ్​ తెలిపారు. చాలా వరకు జ్వరం తగ్గిందని, రక్త పరీక్షల్లో తెల్లరక్త కణాలు, సీఆర్​పీ లెవెల్స్ ​పెరుగుతున్నాయని చెప్పారు. కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని తెలిపారు.