పుష్ప2 ప్రీమియర్.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్: పుష్ప2 తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ యజమానితో పాటు మేనేజర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన భద్రతా చర్యలు తీసుకోని సెక్యూరిటీ మేనేజర్ను కూడా అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురినీ అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద బుధవారం రాత్రి (డిసెంబర్ 4, 2024) తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షోకు అభిమానులు భారీగా తరలివెళ్లారు.

హీరో అల్లు అర్జున్, శ్రీలీల, మూవీ టీమ్, అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు పుష్ప-2ను అభిమానులతో కలిసి వీక్షించేందుకు సంధ్య థియేటర్కు వెళ్లారు. అల్లు అర్జున్ వస్తున్నట్లు తెలియడంతో అతనిని చూసేందుకు సంధ్య థియేటర్ వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అల్లు అర్జున్ను దగ్గర నుంచి చూసేందుకు ఎగబడ్డారు. కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. 

ప్రీమియర్ షో చూసేందుకు సంధ్య థియేటర్ వద్దకు వచ్చిన రేవతి(35), ఆమె కొడుకు శ్రీతేజ్ (9) తీవ్రంగా గాయపడ్డారు. బాలుడు స్పృహ కోల్పోవడంతో పోలీసులు సీపీఆర్ చేసి దగ్గర్లోని సికింద్రాబాద్ లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందగా, శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉంది.