హైదరాబాద్: సంధ్య థియేటర్.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఓ సెంటిమెంట్ సింగిల్ స్క్రీన్ థియేటర్.. ఏ కొత్త సినిమా విడుదలైనా సరే.. సంధ్య థియేటర్ ముందు ఉండే సందడి అంతాఇంతా కాదు. ప్రీమియర్ షో ఈ థియేటర్లో పడి తీరాల్సిందే. ఫ్యాన్స్ ఈలలు, కేకలతో థియేటర్ దద్ధరిల్లిపోతుంది. అక్కడికి ఆ సినిమా హీరో, హీరోయిన్, యూనిట్ రావటం ఆనవాయితీనే కాదు.. సెంటిమెంట్ కూడా.. ఆల్ మోస్ట్ 30 ఏళ్లుగా ఇదే జరుగుతుంది.
ఒకే ఒక్క సినిమా.. పుష్ప 2 మూవీతో.. ఇప్పుడు ఏకంగా సంధ్య 70 ఎంఎం థియేటర్ మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం.. చిక్కడపల్లి పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసులే.. సంధ్య థియేటర్కు చిక్కడపల్లి పోలీసులు పంపిన షోకాజ్ నోటీసుల్లో ఏముందో డీటెయిల్డ్గా తెలుసుకుందాం..
Also Read :- అల్లు అర్జున్ బెయిల్ రద్దు కాబోతున్నదా
సంధ్య థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసులు పంపించారు. పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో యాజమాన్యాన్ని బాధ్యులుగా చేస్తూ థియేటర్ లైసెన్స్ ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని పోలీసులు ఆ నోటీసుల్లో ప్రశ్నించారు. సంధ్య థియేటర్ నిర్వహణ లోపాలపై వివరణ ఇవ్వాలంటూ చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసులివ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
సంధ్య థియేటర్కు చిక్కడపల్లి పోలీసులు పంపిన షోకాజ్ నోటీసుల్లో ఏముందంటే..
* ఒక మహిళ మరణానికి దారి తీసిన ఘటనపై సినిమాటోగ్రాఫ్ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ అడిగిన పోలీసులు
* పది రోజుల్లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్న చిక్కడపల్లి పోలీసులు
* సంధ్య 70MM థియేటర్ నిర్వహణలో లోపాలను గమనించిన పోలీసులు
* సంధ్య 70MM, సంధ్య 35MM థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి.. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకే వైపు ఉన్నాయి..
* రెండు థియేటర్లలో కలిపి దాదాపు 2520 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.
* ఎంట్రీ అండ్ ఎగ్జిట్లను సూచించే సరైన సైన్ బోర్డులు లేవు
* ప్రేక్షకులకు దారి చూపడానికి ఎంట్రీ, ఎగ్జిట్ ప్రదర్శించే సరైన సైన్ బోర్డులు లేవు
* అనుమతి లేకుండా థియేటర్ వెలుపల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రేక్షకులు పోగవ్వడానికి అవకాశం ఇచ్చారు
* థియేటర్లో మౌలిక సదుపాయాలు సరిగా లేవు
* అల్లు అర్జున్ రాక గురించి స్థానిక పోలీసులకు తెలియజేయడంలో థియేటర్ నిర్వాహకులు విఫలమయ్యారు
* అల్లు అర్జున్ రాకపై యాజమాన్యానికి సమాచారం ఉన్నప్పటికీ ఎంట్రీ, ఎగ్జిట్ సీటింగ్ ప్లాన్ చేయలేదు
* అల్లు అర్జున్తో పాటు తన ప్రైవేట్ సెక్యూరిటీని కూడా థియేటర్ లోపలికి అనుమతించారు
* టికెట్లను తనిఖీ చేయడానికి సరైన వ్యవస్థ లేదు, అనధికారిక ప్రవేశాన్ని అనుమతించి థియేటర్ లోపల రద్దీ పెరిగేలా చేశారు