IND vs ENG 1st ODI: నాగపూర్ క్రికెట్ మ్యాచ్‌లో.. పుష్ప జాతర రప్పా.. రప్పా..!

IND vs ENG 1st ODI: నాగపూర్ క్రికెట్ మ్యాచ్‌లో.. పుష్ప జాతర రప్పా.. రప్పా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2: ది రూల్’ ఫీవర్ ఏ రేంజులో ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రిలీజై మూడు నెలలు కావొస్తున్నా.. పుష్పరాజ్ సందడి మాత్రం ఇంకా తగ్గడం లేదు. థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీల్లో దుమ్ములేపుతోంది. సినిమాలో గంగమ్మ జాతర లెక్క రప్పా.. రప్పా.. ఆడిస్తోంది. తాజాగా, ‘పుష్ప రాజ్’ నాగ్‌పూర్‌ వేదికగా భారత్, ఇంగ్లండ్‌  మధ్య జరుగుతున్న తొలి వన్డేలో దర్శనమిచ్చాడు. 

స్టేడియంలో కెమెరామెన్ కంట పడాలంటే.. ఏ బ్యానరో.. ఏ జెండానో పట్టుకెళ్లాలి అనేది ఒకప్పటి లెక్క. ఇప్పుడంతా మాస్ జాతర. ట్రెండింగ్‌లో ఉన్న విషయాన్ని నలుగురిలో ప్రదర్శిస్తే.. కెమెరామెన్ కంట పడినట్టే. ఓ అభిమాని సరిగ్గా అదే చేశాడు. పుష్ప రాజ్’ గెటప్‌లో మ్యాచ్‌కు హాజరయ్యాడు. అంతే, కెమెరామెన్ల కళ్లన్నీ అతనివైపే. సమయం దొరికినప్పుడల్లా అతన్నే చూపెట్టారు. ఆ సమయంలో ‘అదిగో పుష్ప రాజ్’ అంటూ కామెంటేటర్లు వ్యాఖ్యానించడం మరింత ఆసక్తిని రేపింది. 

అయ్యర్ మెరుపులు

ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఛేదనలో టీమిండియా 19 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్‌ (15), రోహిత్‌ శర్మ (2) ఇద్దరూ స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్(20 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభ్‌మాన్ గిల్(17 బంతుల్లో 12 నాటౌట్; 2 ఫోర్లు) జోడి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 11 ఓవర్లు ముగిసేసరికి 77/2.

ALSO READ | IND vs ENG, 1st ODI: ఇంగ్లాండ్ డీసెంట్ టోటల్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?