Pushpa2 First Review: ఈడొకడు.. ఇంకా రాలేదేంటా అనుకున్నాం.. వచ్చేశాడయ్యా పుష్ప2 రివ్యూతో..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప-2 క్రేజ్ విపరీతంగా ఉంది. బాహుబలి సినిమా తర్వాత ఒక సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఇంతలా ఎప్పుడూ ఎదురు చూడలేదేమో. ఇంత హైప్ ఉన్న పుష్ప-2 సినిమా విడుదలకు ఒకరోజు ముందే.. డిసెంబర్ 4న రాత్రి 9.30కే థియేటర్లలో ప్రీమియర్ షోస్ ప్రదర్శించనున్నారు. అసలే ఆకాశాన్నంటుంతున్న అంచనాలతో ఫ్యాన్స్ టెన్షన్లో ఉంటే పుష్ప-2 డీటైల్డ్ ఫస్ట్ రివ్యూ అంటూ ఒక కోయిల తొందరపడి ‘ఎక్స్’లో ముందే కూసింది. 

ఇంతవరకూ పుష్ప-2 సినిమా ఓవర్సీస్లో ఎక్కడా ప్రదర్శితం కాలేదు. కానీ.. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని తనకు తాను చెప్పుకునే ఉమైర్ సంధు పుష్ప-2 సినిమా చూసేసినట్టుగా రివ్యూ ఇచ్చేశాడు. పుష్ప-2 ఫస్ట్ డీటైల్ రివ్యూ అని తన ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టాడు. పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ సూపర్ అదరగొట్టాడని, సూపర్ ఫామ్లో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. మరో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకునేంతలా అద్భుతంగా నటించాడని రాసుకొచ్చాడు.

పుష్ప-2 సినిమా మాత్రం ఫహాద్ ఫాజిల్దేనని, వన్ మ్యాన్ షోతో చించేశాడని, ఈ సినిమాకు క్లైమ్యాక్స్ వల్ల టికెట్లు గట్టిగా తెగుతాయని పోస్ట్ చేశాడు. ఇంట్రవెల్ బ్లాక్స్ మైండ్బ్లోయింగ్ అని, ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సరికొత్త కమర్షియల్ మసాలా సినిమా ఇంతవరకూ రాలేదని రాసుకొచ్చాడు. ఇది పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చెప్పుకొచ్చిన ఉమైర్ సంధు పనిలో పనిగా దేవీశ్రీప్రసాద్ పై రాళ్లేశాడు. అంత చార్ట్బస్టర్ మ్యూజిక్ కాదని విమర్శించాడు. బాక్సాఫీస్ రికార్డ్స్ను పుష్ప-2 బ్రేక్ చేస్తుందని, 2024లో ఇదే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పి.. పుష్ప-2 సినిమాకు 5కి 4 స్టార్స్ రేటింగ్ కూడా ఇచ్చాడు. 

ఇతని పోస్ట్ చూసిన నెటిజన్లు కారాలుమిరియాలు నూరుతున్నారు. ‘‘అసలే పుష్ప-2పై హైప్తో రిజల్ట్ ఎలా ఉంటుందోననే టెన్షన్లో ఉంటే వీడొకడు మా ప్రాణానికి’’.. అని పొట్టుపొట్టు తిడుతున్నారు. పుష్ప-2 సినిమా అలరిస్తే మంచిదేనని కానీ సినిమా చూడకుండా ఇలాంటి ఫేక్ రివ్యూలు ఇవ్వడం ఏంటని ఉమైర్ సంధుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ ఉమైర్ సంధు రివ్యూలను నమ్మడం జనాలు మానేసినా సరే ఇతను ఫేక్ రివ్యూలు ఇవ్వడం మాత్రం మానుకోవడం లేదు. ఈ ఉమైర్ సంధు ‘ఆచార్య’, ‘గుంటూరు కారం’ సినిమాలకు కూడా సూపర్ హిట్, బంపర్ హిట్ అని సొల్లు రివ్యూలు ఇచ్చాడు.  తీరా చూస్తే ఆ సినిమాల రిజల్ట్ ఏంటో తెలిసిందేగా. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకునే ఇతని ఐడెంటిటీ కూడా ఫేక్ అయి ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. అదీ మేటరు.