- స్వదేశీ స్పేస్ షటిల్ కు కర్నాటకలోని ఎయిర్ ఫీల్డ్ లో ప్రయోగాత్మక పరీక్ష
- రీయూజబుల్ లాంచ్ వెహికల్ (ఆర్ఎల్వీ) తయారీలో ఇండియా మరో ముందడుగు
బెంగళూరు: భారత స్వదేశీ స్పేస్ షటిల్ గా పిలుచుకుంటున్న ‘పుష్పక్’ రీయూజబుల్ లాంచ్ వెహికల్ (ఆర్ఎల్వీ) రాకెట్ కు శుక్రవారం మూడో ఫ్లైట్ టెస్టు నిర్వహించనున్నారు. విమానం మాదిరిగా రెక్కలతో కూడిన ఈ రాకెట్ ను శుక్రవారం ఉదయం 7 గంటలకు కర్నాటకలోని డిఫెన్స్ ఎయిర్ ఫీల్డ్ లోని చాలకెరె రన్ వే నుంచి పరీక్షించనున్నారు. ఈ రాకెట్ తయారీతో రీయూజబుల్ రాకెట్ రంగంలోకి మన దేశం కూడా చేరింది. శుక్రవారం జరిగే ప్రయోగం పుష్పక్ సిరీస్ లో మూడోదని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. రాకెట్ ను స్పేస్ లోకి పంపి మళ్లీ భూమి మీదకు సురక్షితంగా తేవొచ్చని ఆయన చెప్పారు. అలాగే కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాలకు ఈ రాకెట్ రీఫ్యూయెలింగ్, రిఫర్బిష్ మెంట్ (ఉపగ్రహాలను శుభ్రం చేయడం లేదా అప్ గ్రేడ్ చేయడం), రిట్రీవ్ చేయడం వంటివి కూడా చేస్తుందన్నారు. రోదసిలో ఉపగ్రహ శకలాలను సాధ్యమైనంత వరకు తగ్గించడమే తమ ముందున్న ధ్యేయమని, ఆ దిశగా పుష్పక్ తో మొదటి అడుగుపడుతుందని సోమనాథ్ పేర్కొన్నారు.
తయారీకి దశాబ్దం పట్టింది..
పుష్పక్ ఆర్ఎల్వీని అభివృద్ధి చేయడానికి దాదాపు దశాబ్దా కాలం పట్టింది. మొదటిసారిగా 2016లో శ్రీహరికోట నుంచి దీనిని విజయవంతంగా ప్రయోగించారు. స్పేస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత రాకెట్.. బంగాళాఖాతంలోని వర్చువల్ రన్ వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే, దీనిని రికవరీ చేయలేదు. అనుకున్నట్లుగానే ఇది సముద్రంలో మునిగిపోయింది. అలాగే 2023 ఏప్రిల్ 2న కర్నాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి రెండోసారి విజయవంతంగా దీనిని ప్రయోగించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన చినూక్ హెలికాప్టర్ సాయంతో దీనిని గాలిలోకి తీసుకుపోయి భూమి మీదకు జారవిడిచారు. ‘పుష్పక్ విమాన్’ రామాయణంలో ఉందని, కుబేరుడికి ఇది వాహనమని సోమనాథ్ చెప్పారు. అందుకే ఆర్ఎల్వీకి పుష్పక్ అనే పేరు సరిగ్గా ఉంటుందనే ఆ పేరుపెట్టామని వివరించారు. భవిష్యత్తులో పుష్పక్ రాకెట్ ద్వారా మంచి ఆదాయం కూడా వస్తుందని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్ గ్రూప్ ప్రోగ్రాం డైరెక్టర్ సునీల్ తెలిపారు. కాగా, పుష్పక్ ఆర్ఎల్వీ పొడవు 6.5 మీటర్లు, బరువు 1.75 టన్నులు ఉంటుంది. ఐఏఎఫ్ హెలికాప్టర్ సాయంతో దీనిని ప్రయోగిస్తారు. దీనిని తయారు చేయడానికి కేంద్రం రూ.100 కోట్ల నిధులు కేటాయించింది.