కరోనా తర్వాత మళ్లీ మొదలైన పుష్పుల్ ట్రైన్

వరంగల్ జిల్లా: కరోనాతో దాదాపు రెండేళ్లుగా నిలిచిపోయిన పుష్పుల్ రైలు సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. వరంగల్ రైల్వే స్టేషన్ లో సోమవారం స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ జెండా ఊపి పుష్పుల్ రైలు సేవలను ప్రారంభించారు. కరోనా వల్ల 2020 మార్చిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని అన్ని ట్రైన్ సర్వీసులను ఆపివేశారు. ఈ క్రమంలోనే వరంగల్ – సికింద్రాబాద్ మధ్య నడిచే పుష్పుల్ ట్రైన్ ను కూడా రద్దు చేశారు. అయితే మొదటి లాక్ డౌన్ తర్వాత రైల్వే శాఖ కొన్ని ట్రైన్లకు అనుమతినిచ్చింది. ఇక రెండో లాక్ డౌన్ తర్వాత దాదాపు అన్ని ట్రైన్ సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కానీ పుష్పుల్ రైల్ సేవలు మాత్రం మళ్లీ ప్రారంభం కాలేదు. దీంతో చాలా మంది ప్రయాణికులు పుష్పుల్ సేవలను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎట్టకేలకు ఇవాళ పుష్పుల్ రైలు సేవలు పున:ప్రారంభమయ్యాయి. ఇక పోతే ఉదయం 5:15 గంటలకు పుష్పుల్ ట్రైన్ వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. స్టేషన్ ఘన్ పూర్, జనగామ, ఆలేరు, భువనగిరి, బీబీనగర్, మౌలాలి స్టేషన్ల గుండా ఉదయం 8:45 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. మళ్లీ సికిద్రాబాద్ నుంచి ఉదయం 9:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు వరంగల్ కు చేరుకుంటుంది. తిరిగి వరంగల్ లో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటల వరకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి వరంగల్ లో హాల్ట్ అవుతుంది. మొత్తం 14 స్టేషన్ల గుండా రోజుకు 720 కిలోమీటర్ల దూరం వరకు పుష్పుల్ ట్రైన్ పయనిస్తుంది.