స్కీములపై గ్రీవెన్స్ సెల్‌‌‌‌ పెట్టండి.. ప్రజల సందేహాలు తీర్చండి: మంత్రి కొండా సురేఖ

  • కొత్తగా నాలుగు స్కీముల ప్రారంభం‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో అధికారులకు మంత్రి దిశానిర్దేశం

 హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. నూతన పథకాల అమలుకు సంబంధించి మండల స్థాయిలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజల సందేహాలను తీర్చాలని సూచించారు. ఈ నెల 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పథకాలను అమలు చేసేందుకు నిర్ణయించినందున మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌‌‌‌గా సన్నాహక సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కార్యాచరణను అమలు చేయాలని ఆదేశించారు. నూతన పథకాలను నిబద్ధతతో అమలు చేసి, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని సూచించారు. పథకాల అమలు విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక, క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించారు.

భూ భారతి పోర్టల్‌‌‌‌లో నమోదైన పట్టాదారులకు మాత్రమే రైతు భరోసా.. 

భూ భారతి పోర్టల్‌‌‌‌లో నమోదైన పట్టాదారులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని, రియల్ ఎస్టేట్ భూములకు, సాగు యోగ్యం లేని భూములకు రైతు భరోసా ఇవ్వొద్దని కలెక్టర్లకు మంత్రి సురేఖ సూచించారు. జిల్లా, మండల స్థాయిలో ఈ పథకాల అమలుకు నోడల్ ఆఫీసర్ల సేవల వినియోగించుకోవాలని సూచించారు. తమ భూములకు సంబంధించిన వివరాలను రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉంటుందని, ఈ దిశగా ఆలోచన చేయాలన్నారు. అలాగే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుకు కుటుంబాన్ని యూనిట్ తీసుకోవాలని చెప్పారు.