కరోనా మహమ్మారి మూలంగా సంభవించిన మరణాలతో సమాన స్థాయిలో మరణ మృదంగం మోగిస్తున్నవి రోడ్డు ప్రమాదాలే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్లపై నిమిషానికో రోడ్డు ప్రమాదం.. గంటకు 17 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో 70% మంది 18 నుంచి 45 ఏండ్ల వయస్సుగల ఉత్పాదక శక్తిగల ప్రజలే. దీంతో వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతతో కూడిన రహదారి ప్రయాణానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అయితే రవాణా శాఖ కార్యాలయాల్లో పెరుగుతున్న వాహనాలు, జనాభా నిష్పత్తికి అనుగుణంగా సిబ్బంది అందుబాటులో లేరు. ఇక లైసెన్సుల జారీలో లెర్నింగ్ లైసెన్స్ ద్వారా ఔత్సాహిక డ్రైవర్ అభ్యర్థుల థియరీ పరిజ్ఞానాన్ని పరీక్షించడం పరీక్షా విధానంలో భాగమైనా.. రాష్ట్రంలో ఎక్కడా సమగ్ర పరీక్ష ద్వారా లెర్నింగ్ లైసెన్సులు జారీ చేయడం లేదు. డ్రైవింగ్ టెస్టు నిర్వహించే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సైతం రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్, ఎన్ఫోర్స్మెంట్ లాంటి ఇతర విధులు కూడా నిర్వహించాల్సిన పరిస్థితుల్లో తగిన సమయాన్ని కేటాయించి డ్రైవింగ్ ట్రాక్ పై ఆశించిన స్థాయిలో స్కిల్ టెస్టులు చేయలేకపోతున్నారు. ఫలితంగా డ్రైవింగ్ నియమాలపై కనీస అవగాహన లేకుండానే 70% మంది వాహనాలను నడుపుతున్నారని సైబరాబాద్ పోలీసుల ర్యాపిడ్ సర్వేలో తేలింది. అంతంత నైపుణ్యమే ఉన్న డ్రైవర్లు మద్యంమత్తు, అలసట, నిద్రమత్తు, నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేసే క్రమంలో సరైన నిర్ణయాలను తీసుకునే నైపుణ్యం కొరవడి ఘోర ప్రమాదాల బారినపడుతున్నారు.
శాశ్వత ప్రమాద నివారణ చర్యలను చేపట్టాలి
మనదేశం ప్రమాదరహితంగా మారాలంటే సురక్షిత ప్రయాణాలకు అనువైన రోడ్లను నిర్మించాలి. వాటి కండిషన్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వాహనాల ఫిట్నెస్ను తనిఖీ చేసే సౌకర్యాలను సమకూర్చి అవసరమైన సిబ్బందిని నియమించాలి. పకడ్బందీగా లైసెన్సుల జారీ ప్రక్రియను కొనసాగించడంతో పాటు నిష్ణాతులే డ్రైవర్లుగా లైసెన్సులను పొందేలా చూడాలి. జాతీయ స్థాయిలో డ్రైవర్ల నైపుణ్యాలను పరీక్షిస్తూ కాలానుగుణంగా ఆ నైపుణ్యాలను అప్ డేట్ చేసే ప్రత్యేక శిక్షణ సంస్థను నెలకొల్పాలి. జిల్లాస్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ కౌన్సిళ్లను ఏర్పరచి డ్రైవర్లకు అవగాహన తరగతులను నిర్వహించాలి. రహదారి నియమాలను పాఠ్య ప్రణాళికలో చేర్చి స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలి. జాతీయ రహదారులపై స్పీడ్ కెమెరాలు ఏర్పాటు చేసి నిర్దిష్ట స్పీడ్ ను మించి వాహనాలను నడిపే డ్రైవర్లకు జరిమానాలు, శిక్షలను కఠినతరం చేయాలి. పోలియో, ఎయిడ్స్, టీబీ, మలేరియా లాంటి మహమ్మారుల నిర్మూలనకు ప్రభుత్వాలు ఏలాగైతే కావాల్సిన నిధులను సమకూర్చి ప్రత్యేక ఏజెన్సీలను ఏర్పాటు చేసి ఆశించిన ఫలితాలను సాధించాయో అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు సముచిత నిధులతో శాశ్వత ప్రాతిపదికన ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలి. ఆ సంస్థలో రవాణా శాఖలో అనుభవం గల రిటైర్డ్ డీటీసీ, ఆర్టీవో, ఎంవీఐల సర్వీసులను వాడుకోవాలి. వీటికి అదనంగా తల్లిదండ్రులు కూడా తమ వంతు బాధ్యతగా పిల్లలకు రహదారి సంస్కృతిని తెలియజేయాలి. రహదారులు, వాహనాల నిర్వహణకు సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడు రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ఆశించిన ఫలితాలను సాధించగలం. - నీలం సంపత్, రోడ్ సేఫ్టీ యాక్టివిస్ట్