
- ట్రీట్మెంట్ పొందుతూ మృతి
- కుమ్రం భీం జిల్లా వెంకట్రావ్ పేట్ లో ఘటన
- పరారీలో నిందితుడు
కాగజ్ నగర్,వెలుగు : పెండ్లి జరిగి అప్పటికే ఇద్దరు పిల్లలున్న వ్యక్తి.. ప్రేమించాలంటూ ఓ యువతి వెంటపడ్డాడు. తిరస్కరించినా వేధింపులు ఆపలేదు. చివరకు ఆమె ఇంట్లోకి దూరి నోట్లో పురుగుల మందు పోసి పారిపోయాడు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) ఎస్సై రమేశ్ కథనం ప్రకారం..వెంకట్రావ్ పేట్ గ్రామానికి చెందిన రైతు బుడే విట్టు దంపతులకు కొడుకు రాజేందర్, కూతురు దీప(19) ఉన్నారు. దీప ఇంటర్ పూర్తి చేసి ఇంట్లో ఉంటోంది. అదే గ్రామానికి చెందిన దంద్రె కమలాకర్(28) ఆరు నెలలుగా ప్రేమ పేరుతో దీప వెంటపడుతున్నాడు. తనను ప్రేమించాలని వేధించేవాడు. ‘నీకు పెండ్లయ్యింది. భార్యా పిల్లలున్నారు’ అని చెప్పినా వినలేదు.
Also Raed : దారుణం.. అప్పు చెల్లించలేదని నగ్నంగా ఊరేగించారు
తను చెప్పినట్టు వినకుంటే దీప కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. తన కోరిక తీర్చాలని దీపకు వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్ లు పెట్టేవాడు. విషయాలు బయట తెలిస్తే ఎక్కడ కుటుంబం పరువు పోతుందోనని బాధితురాలు ఎవరికీ చెప్పలేదు. ఇదే అలుసుగా తీసుకున్న కమలాకర్ ఈనెల17న సాయంత్రం దీప ఇంట్లో ఒంటరిగాఉందని తెలుసుకుని వెళ్లాడు.
అక్కడ దీప పక్కింటి పదేండ్ల బాలికతో కలిసి టీవీ చూస్తోంది. దీపతో గొడవ పడిన కమలాకర్ తనను ప్రేమించడం లేదని, వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నావని గుమ్మి దగ్గర ఉన్న పురుగుల మందు డబ్బా తెచ్చి బలవంతంగా దీప నోట్లో పోశాడు. బాలికను బెదిరించి బయటకు పంపాడు. దీప అరుస్తూ బయటకు వెళ్లడంతో కమలాకర్ ఇంటి వెనుక నుంచి పారిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు దీప ఆత్మహత్యాయత్నం చేసుకుందని భావించి సిర్పూర్ టి సివిల్ హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కాగజ్ నగర్ కు, అక్కడ నుంచి మంచిర్యాలకు, తర్వాత కరీంనగర్ కు తీసుకువెళ్లారు. ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం కమలాకర్ వేధించిన విషయం చెప్పి చనిపోయింది. డెడ్‌బాడీని సిర్పూర్ సివిల్ హాస్పిటల్ కు తీసుకువచ్చారు. అప్పటివరకు భయంతో ఉన్న బాలిక కూడా విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. దీపను ట్రీట్మెంట్ కోసం తరలించిన టైంలో నిందితుడు కమలాకర్ కూడా ఏమీ తెలియనట్టు మంచిర్యాల వరకు వారి వెంటే వెళ్లాడు. మృతురాలు సోదరుడి ఫిర్యాదు మేరకు ఐపీసీ 302,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. నిందితుడి కమలాకర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.