న్యూఢిల్లీ: దేశంలోని 21 నకిలీ యూనివర్సిటీల లిస్ట్‌ను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రచురించాలని కేంద్ర ప్రభుత్వం ఎంపీలను కోరింది. ఆ సంస్థల్లో చేరకుండా స్టూడెంట్లను హెచ్చరించాలని తెలిపింది. సోమవారం లోక్‌సభ క్వశ్చన్ హవర్లో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ సప్లిమెంటరీ ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఫేక్ యూనివర్సిటీల మూసివేతకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం అభ్యర్థించిందని ఆయన తెలిపారు.
“ఫేక్ యూనివర్సిటీ లిస్ట్‌ను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రచురించాలని ఎంపీలను నేను కోరుతున్నాను. ఈ విధంగా చేస్తే స్టూడెంట్లు ఆ వర్సిటీల్లో చేరకుండా చేయొచ్చు. ఫేక్ యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరాం. మేం నేరుగా చర్యలు తీసుకుంటే ఫెడరలిజంపై ప్రశ్నలు తలెత్తుతాయి” అని పేర్కొన్నారు.