కృష్ణా బోర్డు ఆఫీసును విజయవాడలోనే పెట్టండి : ఆళ్ల గోపాల కృష్ణారావు

కృష్ణా బోర్డు ఆఫీసును విజయవాడలోనే పెట్టండి :  ఆళ్ల గోపాల కృష్ణారావు

 

బోర్డు చైర్మన్ అతుల్ జైన్​కు ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్​ఎంబీ) ఆఫీసును విజయవాడలో ఏర్పాటు చేయాలని ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య విజ్ఞప్తి చేసింది. బుధవారం హైదరాబాద్​లోని జలసౌధలో బోర్డు చైర్మన్ అతుల్ జైన్​కు వినతిపత్రం అందజేసింది. తర్వాత సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాల కృష్ణారావు, సమాఖ్య ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను మానిటరింగ్ కోసం 2014 విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డును ఏర్పాటు చేశారని, ఆఫీసును విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసేందుకు 2018 జనవరిలో భవనాలను పరిశీలించాలని చెప్పారు.

 2019, 2020ల్లో కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖలు కూడా రాసిందని గుర్తుచేశారు. 2020 అక్టోబర్​లో నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్​లో దీనిపై రెండు రాష్ట్రాల అధికారులు చర్చించారని చెప్పారు. అదే ఏడాది డిసెంబర్​లో నాటి వైసీపీ ప్రభుత్వం.. బోర్డు ఆఫీసును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలంటూ కేఆర్ఎంబీకి లేఖ రాసిందన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న విజయవాడలోనే ఆఫీసును ఏర్పాటు చేస్తే అధికారులు రావడానికి, వివిధ సంఘాల ప్రతినిధులు తమ విజ్ఞప్తులు చెప్పుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పారు.