పనుల బిజీలో పట్టించుకోకపోతే నీళ్లు లేక మొక్కలు ఎండిపోతాయ్. ఇంటిని అందంగా మార్చే పూల మొక్కలు వాడిపోతే ఇంటి అందమే కాదు, వాటిని ఇష్టపడే ముఖాల్లో ఆనందమూ ఉండదు. ఇట్లాంటి బాధలు ఇంకెప్పుడూ ఉండవు. మొక్కకో ప్లాంట్బాక్స్పెట్టారంటే నెలకు రెండు సార్లు నీళ్లు పోస్తే చాలు. పచ్చగా ఉంటూ ఏపుగా పెరిగి చక్కగా పూలుపూస్తాయ్.
విత్తు నాటితే మొలక వచ్చే దాకా ఒక కష్టం. మొక్క పెరిగి మానయ్యేదాకా ఇంకో కష్టం. మొక్కలు పెంచడం పిల్లల్ని పెంచడం లాంటిదే. వాటికి ఏ పూటకాపూట నీళ్లు పోయాలి. నీళ్లు ఎక్కువైనా ఇబ్బందే. తక్కువైనా ఇబ్బందే. మొక్కకో రకంగా నీళ్లు పోయాలి. పెరటి మొక్కైనా, పంట చేలోనైనా.. చెట్టుకో నీళ్ల లెక్క ఉంటది. మొక్కల నీటి అవసరాలు తీర్చాలంటే రోజూ అదో పని. ఎక్కువ మొక్కలు పెంచాలంటే ఓ మనిషిని కేటాయించాల్సిందే. కష్టం అయినా పర్వాలేదని మొక్కలు నాటేవాళ్లున్నారు. కానీ, ఎప్పుడో ఒకప్పుడు ఊరికి పోవాల్సి వస్తుంది. ఎంతోకాలం పెంచిన మొక్కలకు నాలుగు రోజులు నీళ్లు లేవంటే అంతే సంగతులు.. వాడిపోయి, ఎండిపోతాయ్. మొక్కలకు నీటి అవసరాలు తీర్చడం ఈ రోజుల్లో కొంచెం కష్టమే. ఈ పనిని ఈజీగా మార్చిండు మాచర్ల రాహుల్. ఆస్ర్టేలియాలో ఎంస్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) చదివి, సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసిండు. తనకు మొక్కలంటే చాలా ఇష్టం. ఉద్యోగంలో బిజీగా ఉన్నా ఇంటి చుట్టూ మొక్కలు నాటిండు. ఇంటిని అందంగా మార్చిండు. జాబ్ చేసేటప్పుడు మెల్బోర్న్లో ఉంటూ సిడ్నీ పోయి వస్తూ ఉండేవాడట. వారం, పది రోజులకు ఒకసారి ఇంటికి పోయేదట. నీళ్లు లేక మొక్కలు ఎండిపోయేవి. మొక్కల మీద ప్రేమ ఉన్నోడు కాబట్టి బాధపడ్డడు. మొక్కలకు నీటి ఇబ్బంది లేకుండా ఎట్ల చేయాల్నని ఆలోచనలో పడ్డడు.
సెల్ఫ్ ఇరిగేషన్
నెదర్లాండ్‌లో సెల్ప్ ఇరిగేషన్కి ఉపయోగపడే ప్రొడక్ట్స్తయారు చేసే కంపెనీ ఒకటి ఉందని తెలుసుకున్నడు. ఆ కంపెనీ తయారు చేసిన ప్లాంట్బాక్స్లు కొన్నడు. ప్రతి పాదుకి ఒక ప్లాంట్ బాక్స్ పెట్టిండు. ఆ బాక్స్ నిండా నీళ్లు పోస్తే చాలు. అందులో దీపంలో ఉన్నట్టే ఒక ఒత్తి ఉంటది.ఆ ఒత్తిని పాదులో నేలను తాకేలా వేలాడేస్తే చాలు. మొక్కకు కావాల్సిన తేమని ఇస్తూ ఉంటది. నీళ్లు ఎక్కువై మొక్క పాడుకాదు. తేమలేక మొక్క చచ్చిపోదు. పదిహేను రోజులు పాదులో తేమ ఉంటుంది. ఉద్యోగం, ట్రావెల్, ఇంకేపనిలో బిజీగా ఉన్నా మొక్కలకు ఏ ఇబ్బంది ఉండదు ఈ సెల్ఫ్ ఇరిగేషన్ టెక్నిక్‌తో.
గ్రీన్ ప్రాజెక్ట్
ఎండ ఎక్కువగా ఉండే ఇండియాలో ప్లాంట్ బాక్స్‌ల అవసరం ఎక్కువగా ఉందని రాహుల్ అనుకున్నడు. ఈ ఐడియాతో ఇండియాలో సెల్ఫ్ ఇరిగేషన్ ప్రొడక్ట్స్‌ని మార్కెట్ చేయాలని 2019లో ఇండియా వచ్చిండు. మన దేశంలో టెంపరేచర్, ఎండని బట్టి మెటీరియల్ సెలక్ట్ చేసుకుని ప్లాంట్ బాక్స్‌లు డిజైన్ చేయడం మొదలుపెట్టిండు. ప్లాంట్ బాక్స్ మాడ్యూల్స్ కోసం నవంబరులో ప్రయోగాలు మొదలుపెడితే 2020 మార్చినాటికి సక్సెస్ అయింది. వీటిని మార్కెట్ చేద్దామనుకునే సరికి కరోనా దెబ్బతో లాక్ డౌన్ వచ్చింది. 2021 ఫిబ్రవరి నెలలో ఈ బాక్స్‌లు కావాల్నని గవర్నమెంట్ ఆర్డర్ పెట్టింది. ఇట్ల ఒడిదుడుకులతో రాహుల్ ప్రయోగం సక్సెస్ అయింది. ‘గ్రీన్ నౌ’ పేరుతో కంపెనీ స్టార్ట్ చేసి ఎంట్రప్రెనూర్‌గా నిలదొక్కుకున్నడు.
కుదురుపైన కుదురుగా
ప్లాంట్ బాక్స్ మొక్క చుట్టూ కుదురుపైన ఉంటుంది. ఇందులోని వత్తి కుదురుని తేమగా ఉంచుతుంది. కొద్ది కొద్దిగా ఇచ్చే తేమ ఎండకు ఆరిపోదు. ఎందుకంటే కుదురుపైన ఎండ పడకుండా ప్లాంట్ బాక్స్ కవర్ చేస్తూ ఉంటుంది. అలాగే ప్లాంట్ బాక్స్‌లో ఉన్న నీళ్లు ఆవిరికాకుండా ఒక మూత ఉంటుంది. ఇలా తక్కువ నీళ్లతో ఎక్కువ రోజులు మొక్కను కాపాడుకునే ఉపాయం బాగుందని రియల్ ఎస్టేట్ కంపెనీల వాళ్లు ముందుకొచ్చారు. గేటెడ్ కమ్యూనిటీలు, డెవలప్ చేసే వెంచర్స్‌లో వీటిని ఇన్స్టాల్ చేసి గ్రీన్బెల్ట్ని డెవలప్ చేస్తున్నారు.
పండ్ల తోటల పంట పండినట్టే
ప్లాంట్ బాక్స్‌లు పూల మొక్కలు, కూరగాయ మొక్కల కంటే పండ్ల మొక్కలు, కలపనిచ్చే మొక్కలకు వాడొచ్చు. ఒక బాక్స్99రూపాయలు. ఒకమామిడి చెట్టుకు ఒక బాక్స్ పెడితే ఆ వంద రూపాయలకు పది రెట్ల ఆదాయం ఉంటుంది కాబట్టి రైతుకు లాభమే కానీ నష్టం లేదు. అదే ఒక టొమాటో మొక్కకు వంద రూపాయల బాక్స్ పెడితే అంత దిగుబడి ఉండదు. ఆదాయం రాదు. కాబట్టి లాభం లేదు. మామిడి, జామ, సపోట, నిమ్మ, బొప్పాయి లాంటి పండ్ల మొక్కలు, రోజ్ వుడ్, టేక్ వుడ్, శాండల్ వుడ్, రావి, వేప లాంటి కలపనిచ్చే మొక్కల పెంపకానికి కూడా ఇవి అనుకూలమైనవి. కొన్ని మొక్కలకు ఏర్పాటు చేసిన ప్లాంట్ బాక్స్‌ని అవి పెద్దయ్యాక ఉంచాల్సిన అవసరం లేదు. అప్పుడు వాటిని వేరొక మొక్కకు ఉపయోగించేందుకు రౌండ్ షేప్‌లో ఉన్నవేకాకుండా అర్థచంద్రాకారంలో ఉన్న ప్లాంట్ బాక్స్‌లను కూడా తయారు చేశారు. ఇవి ఒకమొక్కనుంచి ఇంకో మొక్కకు అమర్చడానికి ఈజీగా ఉంటాయి. రౌండ్షేప్ బాక్స్‌లో 15 లీటర్ల నీళ్లు పడతాయి. 25 రోజులు నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. అర్థచంద్రాకారంలో ఉన్న ప్లాంట్ బాక్స్‌లో 10 లీటర్ల నీళ్లు పడతాయి. రెండు వారాల వరకు నీళ్లు పోయాల్సిన అవసరం రాదు. :::నాగవర్ధన్ రాయల, బెస్త ఉపేంద్ర.
ఇవి కూడా చదవండి
కరోనాను నిర్లక్ష్యం చేస్తే.. కేసులు మళ్లీ పెరిగే ప్రమాదం
వచ్చే నెల దాకా ఫాస్టాగ్ స్టికర్ ఫ్రీ
చార్మినార్ ను డేంజర్లో పడేస్తున్నరు!
నాటినోళ్ల పేరే.. మొక్కకు పెడుతున్నరు