మార్చి 18న పుతిన్, ట్రంప్​ చర్చలు

మార్చి 18న  పుతిన్, ట్రంప్​ చర్చలు
  • రష్యా- ఉక్రెయిన్​ వార్​పై డిస్కషన్స్.. వెల్లడించిన ట్రంప్​
  • యుద్ధానికి ముగింపు పలికేలా చూస్తమన్న అమెరికా ప్రెసిడెంట్​
  • ఆస్తులపై చర్చిస్తమని వెల్లడి

న్యూయార్క్​: రష్యా– ఉక్రెయిన్​ యుద్ధం ముగించేందుకు అగ్రరాజ్యం అమెరికా చకచకా అడుగులు వేస్తున్నది. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్​తో యూఎస్ఏ ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ చర్చలు జరపనున్నారు. ఫోన్​లో తాను పుతిన్​తో మాట్లాడనున్నట్టు ట్రంప్​ వెల్లడించారు. 

ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌‌‌‌కు తిరిగివస్తుండగా ఎయిర్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌వన్‌‌‌‌లో ట్రంప్​ మీడియాతో మాట్లాడారు. ‘‘నేను మంగళవారం పుతిన్​తో ఫోన్​లో చర్చలు జరుపుతా.  రష్యా– ఉక్రెయిన్​ యుద్ధాన్ని ఆపగలనో లేదో చూడాలనుకుంటున్నా. భూమి, పవర్​ప్లాంట్లపై చర్చిస్తా. రష్యా– ఉక్రెయిన్​ మధ్య కొన్ని ఆస్తుల విభజనపై ఇప్పటికే మాట్లాడా” అని  ట్రంప్​ పేర్కొన్నట్టు మీడియాలో కథనం ప్రచురితమైంది.

ట్రంప్​కు పుతిన్​ సందేశం

 రష్యా–ఉక్రెయిన్ మధ్య 30 రోజుల కాల్పుల విరమణను అమెరికా ప్రతిపాదించగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ దీనికి అంగీకరించారు. రష్యా కూడా సూత్రప్రాయంగా ఒప్పుకున్నప్పటికీ.. శాశ్వత పరిష్కారాలు ఉండాలంటూ మెలిక పెట్టింది. అప్పుడే మూడేండ్ల యుద్ధానికి ముగింపు పలుకుతామని సంకేతాలిచ్చింది. 

అమెరికాతో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని పేర్కొన్నది. వైట్​హౌస్​ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్​ విట్​కాఫ్​ ద్వారా ట్రంప్​కు పుతిన్​ తన సందేశాన్ని పంపించారు. ఇందులో భాగంగానే ఈ వారంలోనే  రష్యా– ఉక్రెయిన్​ అంశంపై అమెరికా, రష్యా నేతలు చర్చలు జరుపుతారని విట్​కాఫ్​ ఇటీవల వెల్లడించారు. రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌‌‌‌ కూడా దీనిని ధ్రువీకరించింది. ఇరుదేశాల అధ్యక్షులు మంగళవారం ఫోన్‌‌‌‌లో చర్చలు జరపనున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు.

బైడెన్​ఆటోపెన్​తో చేసిన క్షమాభిక్షలు చెల్లవు

బైడెన్​సర్కారు తన చివరి రోజుల్లో తీసుకున్న క్షమాభిక్షల నిర్ణయాలు చెల్లవని ట్రంప్​ పేర్కొన్నారు. వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.   ‘‘బైడెన్​నిద్రమత్తులో చాలామందికి క్షమాభిక్షలు ప్రసాదించారు. ఆయన వాటిపై ఆటోపెన్​తో సంతకం చేశారు. అసలు చెప్పాలంటే.. బైడెన్​ వాటిపై సంతకం చేయలేదు.

 ఆయనకు ఈ విషయమే తెలియదు. వాటికి  అవసరమైన డాక్యుమెంట్ల గురించి కూడా బైడెన్​కు వారు చెప్పనేలేదు. ఈ వ్యవహారం నడిపినవారు నేరం చేశారు. అలాగే, అన్‌‌‌‌సెలెక్ట్‌‌‌‌ కమిటీ..  ఆధారాలు మొత్తం నాశనం చేసింది” అని వార్నింగ్​ ఇచ్చారు. కాగా, అమెరికన్​ పాడ్​కాస్టర్​ లెక్స్​ ఫ్రిడ్​మన్​తో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోను డొనాల్డ్​ ట్రంప్​ సోమవారం ట్రుత్​ సోషల్​ మీడియాలో షేర్​ చేశారు.