- రష్యా, నార్త్ కొరియా దేశాల అధినేతల నిర్ణయం
- ఒప్పందంపై పుతిన్, కిమ్ సైన్
- 24 ఏండ్ల తర్వాత నార్త్ కొరియాలో పుతిన్ పర్యటన
సియోల్: అంతర్జాతీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా, నార్త్ కొరియా మధ్య వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. తమపై ఎవరైనా దాడి చేస్తే ఒకరికొకరం సాయం అందించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. సెక్యూరిటీ, ట్రేడ్, ఇన్వెస్ట్ మెంట్, పొలిటికల్, కల్చరల్ రంగాల్లో సహకారం అందించుకోవాలని డెసిషన్ తీసుకున్నాయి. ఈ ఒప్పందంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సంతకాలు చేశారు.
నార్త్ కొరియా పర్యటనకు వెళ్లిన పుతిన్.. బుధవారం కిమ్ జోంగ్ ఉన్ తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇద్దరు లీడర్లు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండు దేశాల బార్డర్ లో బ్రిడ్జి కట్టాలని, హెల్త్ కేర్, మెడికల్ ఎడ్యుకేషన్, సైన్స్ రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. కాగా, అణ్వాయుధాల అభివృద్ధి నేపథ్యంలో నార్త్ కొరియాపై, ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా ఆంక్షలు విధించింది.
ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు నార్త్ కొరియా ఆయుధాలు సరఫరా చేస్తున్నదని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను రష్యా, నార్త్ కొరియా ఖండించాయి. ఈ నేపథ్యంలో నార్త్ కొరియాలో పుతిన్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యాకు మద్దతిస్తం: కిమ్
ఈ డీల్ తో రెండు దేశాల మధ్య కొత్త అధ్యాయం మొదలైందని కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. రెండు దేశాల మధ్య ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాల్లో ఇదే కీలకమైందన్నారు. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతు ఇస్తామని వెల్లడించారు. కాగా, 24 ఏండ్ల తర్వాత పుతిన్ నార్త్ కొరియాలో పర్యటించారు. చివరిసారి 2000 సంవత్సరంలో అక్కడికి వెళ్లారు. మంగళవారం రాత్రి ప్యాంగ్యాంగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పుతిన్ కు కిమ్ ఘన స్వాగతం పలికారు.