- కీవ్ నుంచి పోతం
- బలగాలను తగ్గిస్తమన్న రష్యా
- చెర్నిహివ్ నుంచీ తప్పుకుంటం
- శాంతి చర్చల తర్వాత ప్రకటన
- నమ్మకం కలిగేందుకేనని వెల్లడి
ఇస్తాంబుల్, మాస్కో, కీవ్: బాంబు దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పే దిశగా తొలి అడుగు పడింది. 34 రోజులుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు జరుగుతున్న చర్చలు ఫలితాలనిస్తున్నాయి. మంగళవారం జరిగిన చర్చల తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు చెర్నిహివ్ నగరాల్లో దాడులు ఆపేస్తామని రష్యా ప్రకటించింది. అక్కడ మోహరించిన బలగాలను పెద్ద సంఖ్యలో వాపస్ పిలిపించుకుంటామని తెలిపింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చల తర్వాత రష్యా రక్షణశాఖ డిప్యూటీ మినిస్టర్ అలెగ్జాండర్ ఫోమిన్ ఈ మేరకు ప్రకటన చేశారు. చర్చలపై మరింత నమ్మకం పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని చెప్పారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ చర్చల సారాంశాన్ని ప్రెసిడెంట్ పుతిన్‌కు వివరించిన తర్వాత మిగిలిన వివరాలను మీడియాతో పంచుకుంటామని ఆయన తెలిపారు. మంగళవారం నాటి చర్చలు ఫలవంతంగా జరిగాయని చీఫ్ నెగోషియేటర్ వ్లాదిమిర్ మెడిన్స్కీ కూడా చెప్పారు. తాజా నిర్ణయంతో ఉక్రెయిన్, రష్యా ప్రెసిడెంట్లు నేరుగా కూర్చుని మాట్లాడుకునే రోజు దగ్గర్లోనే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జెలెన్స్కీ, పుతిన్ నేరుగా ముఖాముఖి మాట్లాడుకునేందుకు తగిన సందర్భం ఇదేనని ఉక్రెయిన్ తరఫున చర్చల్లో పాల్గొంటున్న డేవిడ్ అరఖామియా అన్నారు. నాటో కూటమిలో చేరబోమని, అణ్వస్త్రాలు తయారు చేయబోమని ఉక్రెయిన్ చేసిన ప్రకటనలు ఇప్పుడు ఆచరణలోకి రాబోతున్నాయని రష్యా మంత్రి ఫోమిన్ చెప్పారు. ఈ క్రమంలోనే బలగాల ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. మిగతా సిటీలల్లో మోహరించిన రష్యా బలగాల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
కోటి మంది వలస.. 20 వేల మంది మృతి
ఉక్రెయిన్‌లోకి యుద్ధ ట్యాంకులను నడిపించాలంటూ పుతిన్ ఆదేశించి నెలరోజులు దాటింది.. కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైనికులు మిసైళ్ల వర్షం కురిపించారు. రష్యా దాడుల నేపథ్యంలో దాదాపు కోటి మందికి పైగా ఉక్రెయిన్ ప్రజలు తమ ఇల్లూవాకిలి వదిలి వలస వెళ్లిపోయారు. ప్రెసిడెంట్ జెలెన్స్కీ చెప్పిన వివరాల ప్రకారం.. 20 వేల మంది పౌరులు చనిపోయారు. నగరాలన్నీ శ్మశానాలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రష్యా చేసిన ప్రకటన ఉక్రెయిన్ వాసులకు ఊరట కలిగించింది. యుద్ధం ఆగిపోతుందనే నమ్మకం కలుగుతోందని వాళ్లు అంటున్నారు. కాగా, రష్యా ప్రకటనపై బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాల ప్రెసిడెంట్లతో మాట్లాడతానని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ చెప్పారు. మరోవైపు, రష్యా ప్రకటనతో యురప్ స్టాక్ మార్కెట్లు కొద్దిగా కోలుకున్నాయి. నూనె ధరలు ఐదు శాతానికి పైగా దిగొచ్చాయి. డాలర్‌తో రూబుల్ మారక విలువ 10 శాతం తగ్గింది.
దాడులు ఇంకా ఆగలే..
ఓ వైపు ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు జరుపుతున్నప్పటికీ ఉక్రెయిన్ సిటీలపై దాడులను రష్యా ఆపలేదు. పోర్ట్ సిటీ మికోలైవ్లో రష్యా బలగాలు జరిపిన దాడిలో తమ పౌరులు ఏడుగురు చనిపోయారని ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యా బలగాల కంట్రోల్ నుంచి మికోలైవ్, ఇర్పిన్ నగరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. రష్యన్ల ఆధీనంలోని నగరాల నుంచి కూడా తమ పౌరులను తరలిస్తున్నట్లు వివరించింది.
జెలెన్స్కీ లెటర్‌పై పుతిన్ ఫైర్
శాంతి నెలకొల్పేందుకు జెలెన్స్కీ చేసిన ప్రతిపాదనలను పుతిన్ కొట్టిపారేశారు. పుతిన్‌కు జెలెన్స్కీ స్వయంగా రాసిన లెటర్‌ను రష్యన్ బిజినెస్‌మ్యాన్, శాంతి చర్చల మధ్యవర్తి రోమన్ అబ్రామోవిచ్ అందజేశారు. దీనిపై పుతిన్ సీరియస్‌గా స్పందించారని అబ్రామోవిచ్ చెప్పారు. ఈమేరకు ‘ది టైమ్స్’ పత్రిక మంగళవారం ఓ కథనం ప్రచురించింది. జెలెన్ స్కీ లెటర్ అందించిన తర్వాత ‘నేను వాళ్లను దెబ్బకొట్టగలనని అతడి(జెలెన్స్కీ)కి చెప్పు’ అంటూ పుతిన్ పేర్కొన్నట్లు వివరించారు. ఉక్రెయిన్ న్యూట్రల్‌గా ఉండాలన్న డిమాండ్‌ను పరిశీలిస్తున్నామని జెలెన్ స్కీ సోమవారం పేర్కొన్నారు. ఇదే విషయాన్ని లెటర్ లో ప్రస్తావిస్తూ.. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ప్రాథమికంగా జరిగిన శాంతి చర్చల్లో అబ్రామోవిచ్ పాల్గొన్నారని రష్యా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు రెండు దేశాల ప్రతినిధులే చర్చల్లో పాల్గొంటున్నారని వివరించింది.
శాంతి చర్చల్లో విష ప్రయోగం?
ఉక్రెయిన్ తరఫున గతంలో రష్యాతో శాంతి చర్చల్లో పాల్గొన్న రష్యన్ బిజినెస్‌మ్యాన్ రోమన్ అబ్రామోవిచ్ తో పాటు మరొకరిపై విషప్రయోగం జరిగిందని అధికార వర్గాల సమాచారం. ఈ నెల మొదట్లో జరిగిన శాంతి చర్చల సందర్భంగా ఒబ్రావిచ్ అనారోగ్యం పాలయ్యారు. శాంతి చర్చల్లో సానుకూల ఫలితాలు రావొద్దనే ఉద్దేశంతో రష్యా తిరుగుబాటుదారులే ఈ పని చేసి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై అబ్రామోవిచ్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని ఇస్తాంబుల్‌లో జరిగే శాంతి చర్చలకు ఉక్రెయిన్జాగ్రత్తలు తీసుకుంది. మీటింగ్‌లో ఎలాంటి ఆహార పదార్థాలు, డ్రింక్స్ కానీ తీసుకోవద్దని తమ ప్రతినిధులను హెచ్చరించింది.