పుతిన్ భవిష్యత్తు..ప్రశ్నార్థకమే!

రష్యా సైన్యంపై తిరుగుబాటు అంటే ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​పై తిరుగుబాటు కిందే లెక్క. కానీ, అది మొదలైన కొన్ని గంటల లోపలే చప్పున చల్లారిపోయింది. తిరుగుబాటు బావుటా ఎగరేసింది ఎర్గిన్ ప్రిగోహిన్. వాగ్నర్ గ్రూప్ అనే ప్రైవేటు సైన్యానికి అధిపతి. దీన్ని టీ కప్పులో తుఫానుగా భావించడానికి లేదు. ఉక్రెయిన్​పై రష్యా దురాక్రమణ మొదలై ఏడాది దాటిపోయినా అది పూర్తిగా పుతిన్​కు చిక్కలేదు. కొన్ని ప్రాంతాలు రష్యా అధీనంలోకి వచ్చినా అవి తిరిగి చేజారిపోతున్నాయి. రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా, మహా విధ్వంసాన్ని సృష్టిస్తున్నా ఉక్రెయిన్ వాటిని తట్టుకొని నిలబడుతోంది. స్వల్ప స్థాయిలోనైనా ప్రతిఘటన చూపుతోంది. నాటో దేశాల నుంచి తక్కువ సంఖ్యలోనైనా అందుతున్న ఆయుధాలతో అది తన శక్తి మేరకు ఎదురుతిరుగుతోంది. పుతిన్​పై తిరుగుబాటుకు ఒక రకంగా ఈ యుద్ధమే కారణం.

పైకి కనిపించని నిర్లిప్తత

ఉక్రెయిన్​పై యుద్ధంలో రష్యా సైన్యంతోపాటు వాగ్నర్ గ్రూప్ అనే ప్రైవేటు సైన్యం కూడా పాలుపంచుకుంటోంది. క్రూరంగా వ్యవహరించడంలో ఈ ప్రైవేటు సైన్యం సాధారణ సైన్యంకన్నా నాలుగాకులు ఎక్కువ చదివింది. దాంతో దూకుడుగా వ్యవహరిస్తూ ఉక్రెయిన్ ప్రాంతాలను ఆక్రమిస్తోంది. ఆ క్రమంలో సాధారణ సైనికులకన్నా ఈ కిరాయి సైనికులు ఎక్కువ మంది చనిపోతున్నారు. ఉక్రెయిన్​కు చెందిన బఖ్ ముట్ నగరం రష్యా వశమవడానికి వీరి ప్రతాపమే కారణం. కానీ, ఆ క్రమంలో వాగ్నర్ కిరాయి సైనికులు ఎక్కువ మంది చనిపోయారు. రష్యా సైన్యం తమకు తగినంత మందుగుండు సామగ్రిని అందించలేదని ప్రిగోహిన్ ఆరోపణ. పైగా, రష్యా వైమానిక దళం తమపైనే దాడి చేసిందని, ఆ దాడిలో కిరాయి సైనికులను చాలా మందిని కోల్పోయానని ఆయన చెబుతున్నారు. ఆ ప్రైవేటు సైనికులు మామూలు వాళ్లు కాదు. కరడుగట్టిన నేరస్తులు. వారిని ఆయన రష్యాలోని జైళ్ల నుంచి రిక్రూట్ చేసుకున్నారు. ఉక్రెయిన్​పై యుద్ధంలో చనిపోయే అవకాశం ఉందని, కానీ, బతికితే, యుద్ధంలో గెలిస్తే, ఆరు నెలల లోపల అందరూ జైళ్ల నుంచి పూర్తిగా విడుదలయ్యేటట్లు చూస్తానని హామీ ఇచ్చి, వారిని ఆయన తన సైన్యంలోకి చేర్చుకున్నారు. ఉదారంగా డబ్బు ముట్టజెబుతానని కూడా ఆశ చూపారు. సాధారణ సైనికులను ఎలాగైనా రిక్రూట్ చేసుకోవచ్చు. కానీ, ఈ కరడుగట్టిన నేరస్తులను మళ్లీ ఎక్కడ నుంచి కూడగట్టుకోగలనని ఆయన బాధ. రష్యా రక్షణ మంత్రి సెర్గే షోజు, సైనిక దళాల ప్రధానాధికారి డౌలీ జిరాగమొవ్​లను పదవుల నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక కిరాయి సైన్యం అధిపతికి అంత తెగువ ఎలా వచ్చింది? ఆయన పుతిన్​కు నమ్మినబంటుగా వ్యవహరించబట్టి అని జవాబు చెప్పుకోవాలి.

ప్రిగోహిన్ పూర్వాపరాలు

దొంగతనాల కేసుల్లో పదమూడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రిగోహిన్ రష్యా కుబేరుల్లో ఒకడుగా ఎదిగిన తీరు ఆసక్తికరం. సోవియట్ యూనియన్ పతనం అంచుల్లో ఉన్నప్పుడు విడుదలైన వారిలో ఆయనొకరు. అప్పటికాయన పదేళ్లుగా జైలులో ఉన్నారు. సోవియట్ సామ్రాజ్య పతనంతో అన్ని మార్పులకు లోనవుతాయని గ్రహించిన ఆయన సెయింట్ పీటర్స్​బర్గ్​లో చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టి తర్వాత సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లతో వృద్ధిలోకి వచ్చారు. క్యాటరింగ్ మొదలుపెట్టి, రష్యన్ ప్రజానీకానికి కొత్త రుచులు చూపించారు. సంపద నిచ్చెనపై పైకి ఎక్కుతున్నకొద్దీ రష్యా పాలక వర్గాలతో ఆయనకు సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది. ప్రిగోహిన్ వ్యాపార కుశలత, యుక్తితో  సైన్యంతో సహా, వివిధ రష్యన్ ప్రభుత్వ సంస్థలు తన కంకార్డ్​ను ఆదరించేటట్లు చేసుకున్నారు. అలా పుతిన్ 2001లో అధికారానికి వచ్చేటప్పటికే, రష్యాలో సంపన్నులు, శక్తిమంతులు ఎంచుకొనే క్యాటరింగ్ సంస్థగా అది ఖ్యాతికెక్కింది. లెనిన్ గ్రాడ్(ఇప్పటి సెయింట్ పీటర్స్ బర్గ్)లో 1961 జూన్ 1న పుట్టిన ప్రిగోహిన్ అపర కుబేరుడు అయిపోయారు. ఇతర ప్రభుత్వాధినేతలు రష్యాకు అతిథులుగా వచ్చినపుడు వండివార్చి వడ్డించేది కంకార్డ్ కేటరింగే. అధికారిక విందుల్లో పుతిన్ వెనుక ప్రిగోహిన్ కనిపించడం సర్వసాధారణం. ఆ సందర్భంగా పుతిన్–-ప్రిగోహిన్​ల మధ్య కుదిరిన స్నేహం బలపడి ఇద్దరికీ లాభదాయకంగా పరిణమించింది. ఆహార సేవలకు సంబంధించిన కాంట్రాక్టులన్నీ కంకార్డ్​కే దక్కాయి. ఇలా ఆహార పరిశ్రమ తనను కోట్లకు పడగలెత్తేటట్లుగా చేసినా ప్రిగోహిన్ ఎందుకో 2014లో ప్రైవేటు సైన్యం ఏర్పాటుకు మొగ్గు చూపారు.

పుతిన్ కోటకు బీటలు

పోనీ ఇది టీకప్పులో తుఫానే అనుకున్నా, పుతిన్ బలహీనతలను ఇది బయటపెట్టింది. ఉక్రెయిన్​పై విజయం సాధించడంలో ఆయనకున్న సత్తాపై సందేహాలను రేపింది. అటు ప్రపంచ నాయకులు, ఇటు సామాన్య రష్యన్ పౌరుల దృష్టిలో ఆయన ప్రతిష్ట మసకబారింది. జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన దీన్ని “వెన్నుపోటు”గా అభివర్ణించారు. పుతిన్ మాటలు లేదా చేతల వల్ల గాక బెలారస్ అధ్యక్షుడి జోక్యంతో తిరుగుబాటుకు తెరపడింది. తమ సహజ స్వభావానికి విరుద్ధంగా పుతిన్, ప్రిగోహిన్​లు సంయమనాన్ని పాటించారని కూడా చెప్పాలి. దేశం అంతర్యుద్ధంలో చిక్కుకోకుండా వాగ్నర్ వీరులు వెనకడుగు వేశారు. ప్రిగోహిన్​ను దండించకుండా వదలిపెడతానన్న మాటపై పుతిన్ ఎంతవరకు నిలబడతారో చూడాలి. ఉక్రెయిన్​పై దండెత్తడమే తప్పుగా ప్రిగోహిన్ చెప్పారు. ఆ యుద్ధం విషయంలో ఆది నుంచి అన్నీ పొరపాట్లే జరుగుతున్నాయని అన్నారు. పుతిన్ చెబుతున్న సైద్ధాంతిక కారణాలు ఏమీ లేవని ఆయన నిష్కర్షగా ప్రకటించారు. రక్షణ మంత్రి, రాజకీయ పలుకుబడి కలిగిన కొందరు సంపన్న వ్యాపారవేత్తల వర్గం తమ సంకుచిత ప్రయోజనాల కోసం పుతిన్​ను యుద్ధానికి ఎగదోశారని ఆయన విమర్శిస్తున్నారు. ప్రిగోహిన్​ను కూడా పాశ్చాత్య దేశాల పావుగా పేర్కొని పుతిన్ తన నేరాల నుంచి తప్పించుకోలేరు.

వాగ్నర్ ఎవరి మానస పుత్రికో తెలియదు

పుతిన్ కోరిక మేరకు ప్రిగోహిన్ వాగ్నర్ గ్రూపును ఏర్పాటు చేశారో లేక అది ఆయనకు సొంతంగా పుట్టిన బుద్ధో స్పష్టంగా తెలియదు. రష్యాలో ప్రైవేటు సైన్యం ఏర్పాటు చట్ట విరుద్ధం. కానీ, అది ఉనికిలోకి వచ్చిందంటే పుతిన్ చలవే అయి ఉండొచ్చు. క్రిమియాపై రష్యా 2014లో దాడికి దిగినపుడు రష్యన్ సాయుధ దళాలకు వాగ్నర్ సైనికులు చేదోడువాదోడుగా పనిచేశారు. కానీ, తమ ప్రత్యేకతను కాపాడుకుంటూ వచ్చారు. ఇది లోపాయకారీగా జరిగిన పని. క్రిమియా యుద్ధంలో తాము పాల్గొన్నట్లు వాగ్నర్ అధినేత పరోక్షంగా సూచించడమే తప్ప నేరుగా ప్రకటించింది లేదు. క్రిమియా ఆక్రమణ తర్వాత, ఉక్రెయిన్​ తూర్పు ప్రాంతంలో పనిచేస్తున్న రష్యా అనుకూల వేర్పాటువాదులకు వాగ్నర్ సైనికులు తోడ్పాటునిచ్చారు. దాంతో డోనాస్క్, లుహాన్స్క్​లను వేర్పాటువాదులు ప్రజా గణతంత్ర రాజ్యాలుగా స్వయంగా ప్రకటించేసుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, పుతిన్​కు ప్రచ్ఛన్న సైన్యంగా వాగ్నర్ అవతరించింది. పుతిన్ జోక్యం చేసుకోవాలనుకున్నచోట, అధికారికంగా జోక్యం చేసుకోలేకపోయిన చోట వాగ్నర్ ఆయన తరఫున పనులు చక్కబెడుతూ వచ్చింది. ప్రిగోహిన్ ఒక సమాంతర సేనాధిపతిగా మారిపోయారని వేరే చెప్పనవసరం లేదు. ఆయన కింద పనిచేస్తున్న కిరాయి సైనికులు కనీసం 13 వేల మంది వరకు ఉంటారు. సిరియాలో 2015 చివరలో అంతర్యుద్ధం అప్పుడు బషర్ అల్-అసద్​కు మద్దతుగా వాగ్నర్ సైనికులు పనిచేశారు. సిరియాలో తలలు నరకడం, అవయవాలను ఖండించడం ద్వారా వాగ్నర్ సైనికులు యుద్ధ నేరాలకు పాల్పడినవారుగా, అత్యంత క్రూరులుగా ముద్ర వేసుకున్నారు. సూడాన్, లిబియా, వెనిజులాలలో కూడా వారు తమ క్రౌర్యాన్ని చూపారు. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో వారు ట్రంప్ తరఫున పనిచేశారని చెబుతారు.

పుతిన్​కు ఎసరు

వాగ్నర్ సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోతుండటం, రష్యా సైన్యం చేవ చూపించడం లేదనే భావనతో ప్రిగోహిన్ రష్యా సైన్యంపై తిరుగుబాటును ప్రకటించారు. మాస్కోకి దక్షిణంగా 1100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రస్తోవ్ నదాను నగరాన్ని స్వాధీనపరచుకున్నారు. కొద్ది గంటల వ్యవధిలోనే మాస్కోకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న దోనష్ నగరంలోని సైనిక సదుపాయాలన్నింటినీ తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. దీన్ని విద్రోహ చర్యగా ప్రకటించిన పుతిన్ తీవ్ర హెచ్చరికలే జారీ చేశారు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో నెరిపిన మధ్యవర్తిత్వంతో ప్రిగోహిన్ పైన నేరారోపణలు ఉపసంహరించుకునేందుకు పుతిన్ అంగీకరించినట్లు సమాచారం. అలాగే, బెలారస్​లో ప్రిగోహిన్ ఆశ్రయం పొందేందుకు అనుమతించినట్లు చెబుతున్నారు. మాస్కోలోకి అడుగుపెట్టగలనని ప్రిగోహిన్ సీరియస్ గానే భావించారా? రక్షణ మంత్రిని, సైనిక దళాల ప్రధానాధికారిని తొలగించాలన్న డిమాండ్​కు పుతిన్ అంగీకరిస్తారని బహుశా ప్రిగోహిన్ భావించి ఉంటారు. రష్యా సైన్యంలోని కొన్ని శక్తుల నుంచి తనకు మద్దతు లభిస్తుందని కూడా ఆయన భావించి ఉంటారు. నిజంగా కూడా సైన్యం నుంచి ఆయనకు ప్రతిఘటన అంతగా ఏమీ వ్యక్తం కాలేదు. పుతిన్ ఆదేశించిన తర్వాత హెలికాప్టర్ నుంచి వాగ్నర్ సైనికులపై దాడి జరిగినా, మొత్తం మీద ఘర్షణలు చోటుచేసుకోలేదు.

- మల్లంపల్లి ధూర్జటి,
సీనియర్​ జర్నలిస్ట్