ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు శనివారం బీఆర్ఎస్ పై చేసిన కామెంట్లకు మంత్రి అజయ్‌కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఖమ్మం సిటీలో జరిగిన పలు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్న మంత్రి అజయ్తుమ్మల నాగేశ్వరరావు టార్గెట్‌గా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తుమ్మల ఇక్కడ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నటైంలో చేసిన రాజకీయ హత్యలు అన్నీఇన్ని కావని ఆరోపించారు.
ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎంత మంది రాజకీయ సమాధి అయ్యారో గుర్తులేదా అని ప్రశ్నించారు. మంత్రి పదవులు ఇచ్చినవారినే మోసం చేసిన వ్యక్తి తుమ్మల అని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో రౌడీయిజం, గుండాయిజాన్ని పెంచి పోషించింది నిజం కాదా అని నిలదీశారు. ఎన్టీఆర్, చంద్రబాబును మోసం చేసి, కేసీఆర్ వద్ద చేరిన తుమ్మలకు రాజకీయ నీతి, నిబద్ధత ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సిటీలో రాజకీయ దుర్భర పరిస్థితులు ఏర్పడటానికి కారణం నువ్వు కాదా అంటూ ధ్వజమెత్తారు.
రౌడీ షీటర్లపై, అరాచక శక్తులపై కేసులు పెట్టడం తప్పా అని పువ్వాడ ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఖమ్మంలోని పరిస్థితులను చక్కదిద్దాలనే లక్ష్యంతోనే పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయించామని చెప్పారు. ఫ్రస్ట్రేషన్లో పెద్దాయన ఏదేదో మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎక్కడో పోటీ చేయాలనుకుంటే, ఇక్కడికి తెచ్చిపడేసేసరికి తులనాడుతున్నాడని విమర్శించారు. ఖమ్మం ప్రజల మద్దతు తనకేనని ధీమా వ్యక్తం చేశారు.