ఖమ్మం టౌన్/వైరా, వెలుగు : విద్యా వ్యవస్థ బలోపేతం దిశగా కేసీఆర్ సర్కార్అడుగులు వేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. దసరా కానుకగా స్కూళ్లలో మరో పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. శుక్రవారం ఖమ్మం రోటరీ నగర్ గవర్నమెంట్ స్కూల్లో ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ కార్యక్రమాన్ని కలెక్టర్వీపీ గౌతమ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికే ఉదయం వేళల్లో స్టూడెంట్లకు రాగిజావ, మధ్యాహ్నం భోజనం అందిస్తోందని చెప్పారు. ఇక నుంచి రెండింటి మధ్యలో కిచిడీ, పొంగల్, ఉప్మా వంటి అల్పాహారం అందించనుందని చెప్పారు. సీఎం కేసీఅర్ ఉన్నతంగా ఆలోచించి ఈ పథకాన్ని రూపొందించారన్నారు.
మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. అనంతరం 41వ డివిజన్లో మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొని మాట్లాడారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో 300 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.లక్ష సాయాన్ని అందజేశారు. అలాగే వైరాలోని ఇండోరో స్టేడియం పక్కన ఏర్పాటు చేసిన టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టులను ఎమ్మెల్యే రాములు నాయక్‌తో కలిసి కలెక్టర్వీపీ గౌతమ్ ప్రారంభించారు.