భద్రాద్రి అభివృద్ధే బీఆర్ఎస్ లక్ష్యం: పువ్వాడ అజయ్​కుమార్​

భద్రాచలం,వెలుగు: భద్రాచలం అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్​ పనిచేస్తోందని  మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని సుభాష్​నగర్​ కాలనీ వద్ద రూ.38కోట్లతో నిర్మించే మిగులు కరకట్ట నిర్మాణ పనులకు, ఎస్డీఎఫ్​ నిధులతో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో చేపట్టే పనులకు శంకుస్థాపన, ఏరియా ఆస్పత్రిలో రూ.21.50లక్షలతో నిర్మించిన కిచెన్​ కాంప్లెక్స్, సీసీ రోడ్లను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. 

ఏజెన్సీ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చిందన్నారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇంటిగ్రేటెడ్​ వెజిటబుల్​ మార్కెట్లు, సైడ్​ డ్రైన్లు, మండల కేంద్రాల్లో సెంట్రల్​ లైటింగ్​ సిస్టమ్  నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో  కలెక్టర్ ప్రియాంక అల, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఎస్పీ డా.వినీత్​, ఏఎస్పీ పంకజ్​ పరితోష్​ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని మంత్రి దర్శించుకున్నారు.  ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయనకు వేదపండితులు వేదాశీర్వచనం ఇచ్చారు.  మంత్రి పువ్వాడ భద్రాచలంలో అధికార పర్యటనలో ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్​మీట్ టైంను ప్రకటించింది. ఎన్నికల కోడ్​ వస్తుందనే సమాచారంతో  టూర్​ షెడ్యూల్ కు భిన్నంగా కార్యక్రమాలలో పాల్గొన్నారు.