ఖమ్మం జిల్లాలో జూన్29న రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేషం సాక్షాత్కరించింది. ఇద్దరు ప్రత్యర్థులు ఒకే చోట కలిశారు. బక్రీద్ పండుగ దానికి వేదికైంది. వారెవరో కాదు.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. గొల్లగూడెంలో బక్రీద్పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ గ్రామంలోని మసీద్కి వెళ్లారు. నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సమయంలో మాజీ ఎంపీ పొంగులేటి అక్కడికి వచ్చారు.
ఇంకేముంది అక్కడ ఉన్నవారంతా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. పువ్వాడ తప్పా మరే ఇతర నాయకుడు రాని ఈద్గా కు పొంగులేటి రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో కారాలు మిరియాలు నూరుకునే ఇద్దరు ప్రత్యర్థులు ఒకే వేదికపై ఉండటం.. మసీదులో ముందు వరుసలో కనిపించడం జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తించింది. అయితే కార్యక్రమం అయిపోయే వరకు ఇద్దరూ ఎడమోహం, పెడమోహంతోనే ఉన్నారు. ముస్లిం మత పెద్దలు ఇరువురు నేతలను ఆశీర్వదించారు. జూలై 2న పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.